‘నేరడి’పై ట్రిబ్యునల్‌ కీలక ఆదేశం

Vamsadhara Tribunal Orders on Neradi Barrage - Sakshi

ముంపు ప్రాంతాల గుర్తింపునకు సీడబ్ల్యూసీ సర్వేకు వంశధార ట్రిబ్యునల్‌ ఆదేశం

అక్టోబర్‌ ఆఖరు నుంచి ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలి

 నివేదిక ఆధారంగా జనవరి 10న ఉత్తర్వులు ఇస్తామని స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: నేరడి బ్యారేజీ నిర్మాణ పనులకు మార్గం సుగమం చేసే దిశగా వంశధార నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ (వీడబ్ల్యూడీటీ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టాక అంటే అక్టోబర్‌ ఆఖరు నుంచి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా సర్వే చేసి, ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా జనవరి 10, 2020న ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తాజా ఆదేశాలను రెండు నెలలపాటు నిలుపుదల చేయాలని ఒడిశా చేసిన విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్‌ తిరస్కరించింది.

వంశధార ట్రిబ్యునల్‌ చైర్మన్‌ ముకుంద శర్మ నేతృత్వంలో సభ్యులు జస్టిస్‌ బీఎన్‌ చతుర్వేది, ప్రతిభారాణి, సీఎస్‌ విద్యానాథన్, డి.శ్రీనివాసన్, గుంటూరు ప్రభాకర్, గణేశన్‌ ఉమాపతి, వై.రాజగోపాలరావు, ఎమ్మెస్‌ అగర్వాల్, సుఖ్‌దేవ్‌ సారంగి, కటారి మోహన్, వసీం ఖాద్రీలతో కూడిన బృందం గతేడాది డిసెంబర్‌ 22 నుంచి 29 మధ్య శ్రీకాకుళంతో పాటు ఒడిశాలో వంశధార పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను పరిశీలించారు. తమ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా గతంలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న వంశధార ట్రిబ్యునల్‌.. సీడబ్ల్యూసీ నేతృత్వంలో నేరడి బ్యారేజీ వల్ల ఇరు రాష్ట్రాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలను సర్వే చేసి.. మ్యాపులు తయారీ చేసి జూన్‌ 30లోగా ఇవ్వాలని ఏప్రిల్‌ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ముంపునకు గురయ్యే భూములను సర్వే చేయడానికి రూ. 15.68 లక్షలు, ఒడిశాలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించే పనులకు రూ. 5.91 లక్షల వ్యయంతో ఏపీ సర్కార్‌ టెండర్లు పిలిచింది. కానీ, ఒడిశా సర్కార్‌ సంయుక్త సర్వేకు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని సోమవారం ఏపీ సర్కార్‌ వంశధార ట్రిబ్యునల్‌కు వివరించింది. దాంతో.. వరదలు తగ్గాక అంటే అక్టోబర్‌ ఆఖరు నుంచి ఆరు వారాల్లోగా సర్వేను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని వంశధార ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది రాజగోపాల్, రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్‌ విచారణకు హాజరయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top