సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం జిల్లా బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి, నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.
అనంతపురం అర్బన్/ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం జిల్లా బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి, నగరాధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటలకు నగరంలోని నందిని హోటల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు సమైక్యవాదులు, పార్టీ శ్రేణులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాలయాలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కి సహకరించాలని కోరారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సీమాంధ్ర దోహులని ధ్వజమెత్తారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోకుండా యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.
జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైఎస్ జగన్ పోరాడారన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్, టీడీపీలకు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం వారు ప్రకటన విడుదల చేశారు. ఉదయం నుంచే నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలని, రహదారులను దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకోవాలని శంకరనారాయణ సూచించారు. బంద్ ప్రభావం ఢిల్లీకి తాకాలని, పెద్దలకు కనువిప్పు కలిగేలా ఉండాలన్నారు.
నేడు ప్రైవేట్ పాఠశాలల బంద్
రాష్ట్ర విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గురువారం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బంద్ పాటించనున్నట్లు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షుడు కుసుమ పుల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు