ఎట్టకేలకు మట్టి మాఫియాకు చెక్ | Report to the government to cancel license | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు మట్టి మాఫియాకు చెక్

Aug 23 2014 1:51 AM | Updated on Sep 2 2017 12:17 PM

ఆత్మకూరు చెరువు భూమిలోని మట్టి తవ్వకాలకు ఎట్టకేలకు అధికారులు చెక్ పెట్టారు.

* ఆత్మకూరు చెరువు భూమి తవ్వకాల్లో అక్రమాలు
* ‘సాక్షి’ కథనాలతో విజిలెన్స్, మైనింగ్ అధికారుల్లో కదలిక
* వే బిల్లులు ఇచ్చేందుకు నిరాకరణ
* లెసైన్సు రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక
ఆత్మకూరు (మంగళగిరి రూరల్) : ఆత్మకూరు చెరువు భూమిలోని మట్టి తవ్వకాలకు ఎట్టకేలకు అధికారులు చెక్ పెట్టారు. గత నవంబర్ నుంచి  నిర్విరామంగా మట్టిని తవ్వుకుంటూ కోట్ల రూపాయలకు అమ్ముకుని సొమ్ముచేసుకున్న మట్టి మాఫియాకు అధికారులు అనుమతులు నిలిపివేశారు. వే బిల్లులు ఈనెల 20వరకు మాత్రమే వుండడంతో మట్టి రవాణాకు తిరిగి వే బిల్లులు ఇచ్చేందుకు మైనింగ్ అధికారులు నిరాకరించారు. మట్టి అక్రమ తవ్వకాలపై సాక్షి పత్రికలో ప్రచురితమైన పలు కథనాలపై స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఉన్నతాధికారులను కలసి అక్రమ మట్టి, ఇసుక రవాణాలను అరికట్టాలని కోరారు.

ఆ మేరకు విజిలెన్స్, మైనింగ్ అధికారులు మట్టి తవ్వకాలను పరిశీలించారు. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారించి సంబంధిత కాంట్రాక్టర్ నుంచి జరిమానా వసూలు చేయడంతో పాటు లెసైన్స్ రద్దుచేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఉన్నతాధికారులు  ఇచ్చిన వేబిల్లుల వరకు అనుమతులు ఇవ్వాలని, తదుపరి వే బిల్లులు మంజూరు చేయవద్దంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. దీంతో మట్టి తవ్వకాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. జిల్లా అధికారులు మట్టితవ్వకాలకు సంబంధించి వే బిల్లులు మంజూరు చేయబోమని, మట్టి రవాణా నిలిచిపోయినట్లేనని చెబుతుంటే..

మండల అధికారులు మాత్రం కాంట్రాక్టర్‌కు 2015 వరకు అనుమతులు వున్నాయని, త్వరలోనే తిరిగి మట్టి తవ్వకాలు కొనసాగించుకోవచ్చని చెప్పడం గమనార్హం! ఈ విషయమై మైనింగ్ ఏడీ జగన్మాథరావును వివరణ కోరగా ఈనెల 20వ తేదీతో వే బిల్లుల కాలపరిమితి అయిపోయిందని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఇక ఎటువంటి వే బిల్లులు మంజూరు చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి లెసైన్స్ రద్దు చేయాలని నివేదిక పంపామని, అందుకనుగుణంగా వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఏడీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement