అటవీశాఖ విభాగాల పునర్విభజన | Reorganization of forest departments | Sakshi
Sakshi News home page

అటవీశాఖ విభాగాల పునర్విభజన

Jan 13 2014 4:29 AM | Updated on Sep 2 2017 2:34 AM

జిల్లాలోని అటవీశాఖ విభాగాల పునర్విభజనకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న విభాగాలను పునర్విభజన చేయాలని 2011లో

ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని అటవీశాఖ  విభాగాల పునర్విభజనకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న విభాగాలను పునర్విభజన చేయాలని 2011లో ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రెండేళ్ల తర్వాత  ఎట్టకేలకు ఆమోదం లభించింది. జిల్లాలో అటవీశాఖ (టెరిటోరి యల్) పర్యవేక్షణలో సామాజిక వన విభా గం, వన్యప్రాణి విభాగాలు పనిచేస్తున్నా యి. వీటి పరిధికి తగ్గట్టుగా అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు తలెత్తుతున్నా యి. సెక్షన్ల పునర్విభజన అనంతరం ఆ విభాగాలను పర్యవేక్షించేందుకు జిల్లాకు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీఎఫ్‌వో)కుబాధ్యతలు అప్పగించనున్నారు. ఈయన పరిధిలో మూడు విభాగాల డీఎఫ్‌వోలు పనిచేయనున్నారు. 
 
 పెరగనున్న రేంజర్లు, బీట్ ఆఫీసర్లు
 జిల్లాలో 811.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. నాలుగు రేంజిల పరిధిలో 213 వనసంరక్షణ సమితి పర్యవేక్షణలో 42,281.50 హెక్టార్ల అటవీప్రాంతం ఉంది. అయితే జిల్లాలో ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. అటవీ విస్తీర్ణానికి తగిన విధంగా రక్షణ సిబ్బంది లేకపోవడంతో అడవులతో పాటు వన్యప్రాణులు కూడా అంతరించిపోతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీనిని అరికట్టడానికి ఇప్పుడున్న ఏలూరు, పోలవరం, జంగారెడ్డిగూడెం, కన్నాపురం రేంజిలతో పాటు కొత్తగా జీలుగుమిల్లిలో మరో రేంజిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ రేంజర్ పోస్టును ప్రభుత్వం భర్తీ చేయనుంది. కాగా ఇప్పటి వరకు ఉన్న 43 బీట్‌లను 60కు పెంచారు. దీంతో 17 మంది బీట్ ఆఫీసర్లు అదనంగా జిల్లాకు రానున్నారు. 16 అటవీ సెక్షన్‌లను ఇప్పుడు 22కు పెంచారు. మరో ఆరు పోస్టులు పెరగనున్నాయి. ఒక్కో అటవీబీట్ పరిధిలో మూడువేల హెక్టార్ల వరకు అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షించాల్సి వస్తోంది.. దీంతో రేంజ్ పరిధిని తగ్గించడంతో పాటు బీట్ విస్తీర్ణాన్ని కనిష్టంగా వెయ్యి హెక్టార్లకు కుదించనున్నారు.
 
 వన్యప్రాణి విభాగానికి మరో 10 బీట్‌ల పెంపు 
 పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండడంతో వేటగాళ్ల ఉచ్చులో పడి అరుదైన వన్యప్రాణుల జాతులు కనుమరుగవుతున్నాయి. దీనికి తోడు పశ్చిమ, కృష్ణా జిల్లాలో విస్తరించి ఉన్న కొల్లేరు పరిధిలోని 9 మండలాల్లో 75,126 ఎకరాల అభయారణ్య భూములున్నాయి. ఇవి చాలా వరకు చేపల చెరువులుగా మారాయి. ఉన్న భూములను కాపాడటానికి, పక్షుల రక్షణకు కొత్తగా 10 బీట్‌లను పెంచారు. ఇప్పటి వరకు కైకలూరు, ఏలూరు, నాగాయలంక పరిధిల్లో 17 బీట్‌లుండగా అవి   27కు పెరగనున్నాయి. 10 మంది బీట్ ఆఫీసర్లను కొత్తగా నియమించనున్నారు. ఇదిలా ఉండగా సామాజిక వన విభాగం(సోషల్ ఫారెస్టు) ఏలూరు, జంగారెడ్డిగూడెం, నర్సాపురంలో మూడు రేంజ్ కార్యాలయాలున్నాయి. వీటికి అదనంగా ఒక సెక్షన్ ఆఫీసర్‌ను పెంచాలని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు. దీనికి అనుమతి రావాల్సి ఉంది. 
 
 పోస్టుల భర్తీపై మల్లగుల్లాలు 
 అటవీశాఖల్లో 3,800కు పైగా వివిధ పోస్టులను మూడేళ్లలో భర్తీ చేయడానికి ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంట్లో జిల్లాకు కొన్ని పోస్టులను కేటాయించే అవకాశం ఉందని టెరిటోరియల్ డీఎఫ్‌వో జి.రామ్మోహన్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పునర్విభజన కార్యక్రమం దాదాపుగా పూర్తయ్యిందని త్వరలోనే ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుందని ఆయన ధ్రువీకరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement