తమ్ముళ్ల కోసం... | ration shops divided for tdp followers in vizianagaram district | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల కోసం...

Jun 10 2016 12:46 PM | Updated on Aug 10 2018 8:16 PM

ఉపాధ్యాయ పోస్టుల కుదింపుకోసం రేషన్‌లైజేషన్ పేరుతో పాఠశాలలను తగ్గించేస్తున్న సర్కారు... తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకు రేషన్ షాపులను విడదీసే యత్నానికి శ్రీకారం చుట్టింది.

  రేషన్ షాపుల విభజనకు సన్నాహాలు
  ఇప్పటికే నాలుగు షాపుల ఏర్పాటు
  ప్రతీ 450 రేషన్ కార్డులకూ ఓ రేషన్‌షాపు


విజయనగరం కంటోన్మెంట్: ఉపాధ్యాయ పోస్టుల కుదింపుకోసం రేషన్‌లైజేషన్ పేరుతో పాఠశాలలను తగ్గించేస్తున్న సర్కారు... తమ్ముళ్లకు ఉపాధి కల్పించేందుకు రేషన్ షాపులను విడదీసే యత్నానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే స్థానిక అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో కొన్ని షాపులను విభజించి పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాసిన అధికారులు జిల్లా వ్యాప్తంగా షాపుల విభజనకు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలోనే మునిసిపాలిటీల పరిధిలోని రేషన్ షాపులను విభజించాలన్న ఆదేశాలున్నప్పటికీ ఆ ప్రక్రియ ఇప్పుడు విజయనగరం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించనుంది.

 ప్రతి 450కార్డులకు ఓ రేషన్‌షాపు
జిల్లాలో 1390 రేషన్ షాపులున్నాయి. అన్నపూర్ణ కార్డులు 839, అంత్యోదయ 76,009, తెల్ల కార్డులు 6,01,987 ఉండగా వీటి పరిధిలో 17,79,516 మంది వినియోగదారులున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఒక్కో రేషన్ షాపు పరిధిలోనూ రెండు వందల నుంచి పదమూడు వందల రేషన్ కార్డుల వరకూ ఉన్నాయి. వీటిని విభజించి ప్రతీ 450 నుంచి 500 రేషన్ కార్డులకు ఓ రేషన్ షాపును ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇదేదో పరిపాలనా సౌలభ్యం కోసమో లేక వినియోగ దారులకు మేలయిన పంపిణీ కోసమో అనుకుంటే పొరపాటే! కేవలం తెలుగు తమ్ముళ్లకు ఉపాధి కల్పన కోసమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్థానిక నాయకులు, సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇతర అధికార పార్టీ నాయకుల సూచనల మేరకు అధికారులు ఈ విభజన ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు.

కమీషన్ సంగతి తేల్చకుండానే...
కమీషన్ పెంపుపై ఎలాంటి ప్రకటన చేయకుండా ఇప్పుడిలా రేషన్ షాపుల విభజనను చేపట్టేందుకు నిర్ణయించడం దారుణమని డీలర్లు వాపోతున్నారు.  జిల్లాలో ఉన్న రేషన్ షాపుల్లో తెలుగుదేశం పార్టీ అనుచరులున్న షాపులను వదిలేసి ఇతర షాపులను లక్ష్యంగా చేసుకుని ప్రతిపాదనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతం లో హుద్‌హుద్ తుఫాన్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో సక్రమంగా సరుకులు పంపిణీ చేయలేదంటూ సుమారు 16 మంది రేషన్ డీలర్లను సస్పెండ్‌చేసి వారి స్థానాల్లో తెలుగుదేశం నాయకుల బంధువులను నియమించిన విషయం వారు గుర్తు చేస్తున్నారు. చాలా చోట్ల టెంపరరీగా తెలుగు తమ్ముళ్లే ఇప్పటికీ ఆయా షాపులను నడిపిస్తున్నారు. దీనిపై ఇంకా కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకే తమను బలిపశువులను చేశారని రేషన్ డీలర్లు వాపోతున్నారు.
 
ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలతో విభజిస్తున్నారు
మాకు ఇవ్వాల్సిన కమీషన్ ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు రేషన్ షాపులను విభజిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరుల కోసం ఒత్తిడి చేస్తే అధికారులు వంతపా డటం దారుణం. దీనిని మేం ఖండిస్తున్నాం. డీలర్ల కు ప్రతీ నెలా కుటుంబ పోషణకు ఆదాయం వచ్చే లా చేసి వారికి నచ్చినట్టు చేసుకోమనండి! అంతే కానీ డీలర్ల పొట్ట కొడితే మాత్రం ఖబడ్దార్  ! ఊరుకునేది లేదు. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం.

- సముద్రపు రామారావు, జిల్లా ఉపాధ్యక్షుడు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం, విజయనగరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement