సీఎం జగన్‌కు ధన్యవాదాలు: నవీన్‌ పట్నాయక్‌

Odisha CM Naveen Patnaik And AP CM YS Jagan Video Conference - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మధ్య శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. లాక్‌డౌన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో చిక్కుకుపోయిన ఒడిశా వలస కూలీలు, కార్మికుల తరలింపుపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. అలాగే ఒడిశాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులను తరలించే విషయమై కూడా చర్చలు జరిగాయి. తమ రాష్ట్రానికి చెందిన వలసకూలీలు, కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు కల్పించి ఆదుకున్నందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

ఒడిశా సీఎం ఏమన్నారంటే.. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలనుకుంటున్న ఒడిశా వారికి మంచి వసతి, భోజన సదుపాయాలు అందించారు. అంతేకాక మా రాష్ట్రానికి వస్తున్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేస్తున్నాం. కోవిడ్‌ వల్ల తలెత్తిన క్లిష్ట పరిస్ధితుల్ని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోంది. ధన్యవాదాలు’అని పేర్కొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘మీ అభ్యర్థనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం నవీన్‌ జీ. దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. రిలీఫ్‌ క్యాంపులలో ఉంటున్నవారిలో దాదాపు 1900 మందికిపైగా ఒడిశా వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మిగిలిన వారిని కూడా వారు పనిచేస్తున్న చోటే ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవేళ వారిలో ఎవరైనా తిరిగి ఒడిశా వెళ్లేందుకు సిద్దమైతే వారిని కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం నవీన్‌ జీ. మీలాంటి నాయకులు చాలా స్ఫూర్తిదాయకులు’అని పేర్కొన్నారు.
 
అటు తర్వాత ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మాట్లాడారు. విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒడిశా కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన ప్రజలను బాగా చూసుకుంటున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ నివారణలో బాగా పనిచేస్తున్నారంటూ సీఎంను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చొరవతో గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులు సొంతూళ్లకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.
(చదవండి: మనసున్న మా రాజు సీఎం)


(చదవండి: స్వస్థలాలకు చేరుకున్న మత్స్యకారులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top