ఏక్తా పోయి అక్షయ వచ్చే..! | Midday Meal Scheme Delayed In Prakasam | Sakshi
Sakshi News home page

ఏక్తా పోయి అక్షయ వచ్చే..!

Nov 20 2018 12:16 PM | Updated on Jul 26 2019 6:25 PM

Midday Meal Scheme Delayed In Prakasam - Sakshi

ఒంగోలు టౌన్‌: ప్రభుత పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించేందుకు ప్రభుత్వం తహతహలాడుతోంది. గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మ«ధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని దశలవారీగా వెళ్లగొట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో ఏక్తా ఏజెన్సీ ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో ఆ ఏజెన్సీ వెనకడుగు వేసింది. తమ జీవనోపాధికి ఎలాంటి డోకా లేదనుకుంటూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న నిర్వాహకుల నెత్తిపై పాఠశాల విద్యాశాఖ పిడుగులు వేసింది. ఏక్తా ఏజెన్సీ స్థానంలో తాజాగా అక్షయపాత్రకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో దశలవారీగా అక్షయపాత్రకు ఈ పథకాన్ని అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. పైలెట్‌ ప్రాజెక్టు కింద అద్దంకి, కొరిశపాడు మండలాల్లోని పాఠశాలల్లో వెంటనే మధ్యాహ్న భోజన పథకం అమలు జరిగేలా చూడాలంటూ జిల్లా విద్యాశాఖాధికారికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయాన్ని అక్షయపాత్ర నిర్వాహకులకు కూడా తెలియజేయడంతో వారు ఆ రెండు మండలాల్లోని పాఠశాలల వివరాలు, అందులో ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుంది లెక్కగడుతున్నారు. దీంతో ఆ రెండు మండలాలతోపాటు జిల్లాలోని మిగిలిన మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఆందోళనకు గురవుతున్నా రు. ముందు రెండు మండలాలు అని ప్రకటించి ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు.

పెంపు.. పంపు...
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద అందిస్తున్న డైట్‌ ఛార్జీలను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కొంతమేర పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ పెంపు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎప్పటికైనా కొంత పెరుగుదల ఉంటుందన్న ఉత్సాహంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు విద్యార్థులకు భోజనాన్ని వండి వడ్డిస్తున్నారు. అయితే, వారి ఆశలను అడియాశలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు భగ్గుమంటున్నారు. పెంపు పేరుతో తమను ఇంటికి పంపుతున్నారంటూ విమర్శిస్తున్నారు.

చాపకింద నీరులా...
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిర్వాహకులు నిర్వహిస్తూ వస్తున్నారు. బిల్లులు సక్రమంగా రాకపోయినా, గౌరవ వేతనం నెలల తరబడి నిలిపి వేసినా తమకు ఆసరాగా ఉంటుందన్న ఉద్దేశంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతూ ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం 5,500 మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఉన్నారు. పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండి పెడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. కోడిగుడ్లను ఏజెన్సీ ద్వారా అందిస్తోంది. పప్పు మొదలుకుని వంట నూనె వరకు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులే కొనుగోలు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నారు. అయితే, ఇటీవల ప్రభుత్వం కందిపప్పు, వంట నూనె కూడా సరఫరా చేయడం మొదలుపెట్టింది. చివరకు మ«ధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులచే ఏమీ కొనుగోలు చేయనీయకుండా ప్రభుత్వమే అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. నిత్యావసర సరుకులన్నీ ప్రభుత్వమే అందిస్తుంటే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు కేవలం వండేందుకు మాత్రమే పరిమితమయ్యేలా చేస్తోంది. చివరకు ఆ వంటను కూడా వారికి కాకుండా ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే అక్షయపాత్రను రంగంలోకి దించింది. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో తమ ప్రాధాన్యతను క్రమేణా తగ్గిస్తూ చివరకు కరివేపాకులా తొలగించేందుకు ప్రభుత్వం ఎత్తుగడ వేసిందంటూ నిర్వాహకులు వాపోతుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement