గుడ్లుతేలేస్తున్న వంట ఏజెన్సీలు! | Mid Day Meal Scheme Delayed In Srikakulam | Sakshi
Sakshi News home page

గుడ్లుతేలేస్తున్న వంట ఏజెన్సీలు!

Nov 1 2018 8:06 AM | Updated on Jul 11 2019 5:40 PM

Mid Day Meal Scheme Delayed In Srikakulam - Sakshi

శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనపథకం వండుతున్న ఏజెన్సీలకు గుడ్డు భారం కానుంది. అక్టోబరు 31వ తేదీ వరకు కాంట్రాక్టరు ద్వారా గుడ్లను సరఫరా చేయగా, ఆ గడువు ముగియడంతో నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ఏజన్సీలే స్థానికంగా గుడ్లు సమకూర్చుకోవాలనిప్రభుత్వం ఆదేశించింది. కాంట్రాక్టు కాల వ్యవధి ముగియకముందే కొత్త ఏజెన్సీలు ఖరారుచేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రభుత్వం వారం రోజుల క్రితం ఓ ఉత్తర్వును విడుదల చేస్తూ ఏజెన్సీలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. స్థానికంగానే గుడ్లును సమకూర్చుకుంటే అన్ని ఖర్చులతో కలిపి గుడ్డుకు 4.68 రూపాయలు చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. ఒక్కో గుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాములు బరువు ఉండాలని ఆదేశించింది. గుడ్లు బిల్లులను ప్రధానోపాధ్యాయులు యాప్‌ ద్వారా రాష్ట్ర స్థాయికి నివేదించాలని చెబుతూ, వంట ఏజెన్సీలు, ఎన్జీఓల నుంచి రాతపూర్వకంగా హామీపత్రాలను తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు ఆపనిలో నిమగ్నమై ఉండగా, పలు వంట ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీలకు ఇప్పటికే మూడు నుంచి నాలుగు నెలల బిల్లులు బకాయి ఉండగా, కొత్తగా గుడ్లను సైతం స్థానికంగానే సమకూర్చుకోవాలని చెప్పడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని ఖర్చులతో కలిపి రూ.4.68 లు ఇస్తుండగా, కేవలం గుడ్డు కొనుగోలుకు రూ.4లకు పైబడి వెచ్చించాల్సి ఉంది. ఇలా ఒక్కో విద్యార్థికి వారానికి 5 గుడ్లు చొప్పున రూ.20 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వంద మంది విద్యార్థులు ఉంటే ఆ ఏజెన్సీలు రెండువేల రూపాయలు వారానికి గుడ్లు కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వీటిని తక్షణం చెల్లించే అవకాశాలు కూడా తక్కువ. అలా అని విక్రయదారులు అరువు ఇచ్చే ప్రసక్తే ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమపై భారం మోపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 2.2 లక్షల మంది విద్యార్థులు ప్రతిరోజు గుడ్లను తింటున్నారు. ఈ లెక్కన ఏజెన్సీలు అన్ని కలిపి గుడ్లు కోసం రోజుకు 8.8 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత మొత్తాన్ని భరించే స్థోమత తమకు లేదని, ఇప్పటికే సకాలంలో బిల్లులు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, వాటినిపరిష్కరించాల్సింది పోయి కొత్తగా మరింత భారాన్ని మోపడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ విధానాన్ని నిలుపుదల చేసి ఏజెన్సీల ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలనిడిమాండ్‌ చేస్తున్నారు. అలా కాని పక్షంలో వంటను మానేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

పలు సంఘాలు ఖండన
ఏజెన్సీలను గుడ్లు సమకూర్చుకోవాలని చెప్పడాన్ని ఏపీటీఎఫ్, యూటీఎఫ్, డీటీఎఫ్‌ నాయకులు భానుమూర్తి,  చౌదరి రవీంద్ర,   పేడాడ కృష్ణారావులు తప్పుపట్టారు. ఏజెన్సీలు సమకూర్చుకోనప్పుడు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ఆ బాధ్యతలను తీసుకోవాలని చెప్పడాన్ని కూడా  ఆక్షేపించారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు నిధులు లేకపోవడంతో ఇప్పటికే వేలాది రూపాయలు తమ జేబు నుంచి ఖర్చు చేశారని మళ్లీ గుడ్లు కోసం వెచ్చించే పరిస్థితి ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు లేదన్నారు.

ఏజెన్సీలకు ఇప్పటికే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు తుపాను సందర్భంగా బాధితులకు ఆహారాన్ని సరఫరా చేసేందుకు పెట్టిన ఖర్చు కూడా ఇప్పటికి ఇవ్వకపోగా, కొత్తగా మరింత ఆర్థిక భారాన్ని మోపాలని చూడడం సరికాదని అన్నారు. ప్రభుత్వం టెండర్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించి దానిని కప్పిపుచ్చుకొనేందుకు ఎవరిని బలి చేస్తారని నిలదీశారు. ఇదే విధానం కొనసాగితే ఆందోళన తప్పదని బుధవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement