
లారీ, ఆటో ఢీకొని ముగ్గురు మృతి
పామర్రు రోడ్డుపై మృత్యువు కరాళ నృత్యం చేసింది. ఉదయం ఎనిమిదైనా వీడని మంచు తెరలు ముగ్గురి మృతికి కారణమయ్యాయి.
=లారీ, ఆటో ఢీకొని ముగ్గురు మృతి
=ఆరుగురికి తీవ్ర గాయాలు
=ఒకరి పరిస్థితి విషమం
పామర్రు రోడ్డుపై మృత్యువు కరాళ నృత్యం చేసింది. ఉదయం ఎనిమిదైనా వీడని మంచు తెరలు ముగ్గురి మృతికి కారణమయ్యాయి. డ్రైవర్ సహా ఎనిమిది మందితో వెళ్తున్న ఆటో మంచులో ఎదురుగా వస్తున్న లారీని గమనించక వేగంగా ఢీకొట్టడంతో ఆటోలోని వారు విసిరేసినట్టు పడిపోయారు. ఆటోడ్రైవర్ తన సీటులోనే మృతిచెందాడు. మరో హోంగార్డు, పాలిటెక్నిక్ విద్యార్థి ఈ ఘటనలో ప్రాణాలొదిలారు.
పామర్రు, న్యూస్‌లైన్ : స్థానిక చల్లపల్లి రోడ్డులోని కోటీనగర్‌కు సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 8 మంది ప్రయాణికులతో కూచిపూడి వైపు నుంచి వస్తున్న ఆటో పామర్రు కోటీనగర్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మొవ్వ మండలం పెడసనగంటిపాలేనికి చెందిన ఆటో డ్రైవర్ పేరం నాగరాజు (25), చినముత్తేవికి చెందిన హోంగార్డు కె.గోవర్ధనరావు (32), మొవ్వ గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి అసినేటి రాజేష్ (19) అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ఘటనలో చలమలశెట్టి సంధ్య, కొండవీటి అభినాష్, అబ్దుల్ షంషాద్ బేగం, బొద్దుల నాంచారమ్మ, అనుశెట్టి అజేయ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెనకే మరో ఆటోలో వస్తున్న రాజేష్ బంధువులు అతను కాస్త కదులుతుండటం గమనించి గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గంలోనే ప్రాణాలొదిలాడు. మృతుడు నాగరాజు (25)కు భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. హోంగార్డు గోవర్ధనరావు (32)కు భార్య ఒక బాబు, ఒక పాప ఉన్నారు. రాజేష్ స్థానిక టీకేఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనలియర్ విద్యార్థి.
బైక్‌పై వస్తున్న మరొకరికి గాయాలు...
ఈ ప్రమాదం సమయంలో వెనుకే బైక్‌పై వస్తున్న చినముత్తేవికి చెందిన కలపాల శేఖర్ అనే వ్యక్తి ఆటోను ఢీకొని గాయపడ్డాడు. అతన్ని స్థానికంగా ప్రైవేటు వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాద స్థలాన్ని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన పరిశీలించారు. స్థానికంగా చికిత్సపొందుతున్న కలపాల శేఖర్‌ను ఆమె పరామర్శించి వైద్యం ఖర్చుల నిమిత్తం రూ.2 వేలు అందజేశారు.
డీఎస్పీ పరిశీలన...
ఘటనాస్థలిని గుడివాడ డీఎస్పీ సీతారామస్వామి పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానాన్ని, క్షతగాత్రుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పామర్రు సీఐ శ్రీనివాస యాదవ్, ఎస్‌ఐ డీ శివశంకర్ ఆయన వెంట ఉన్నారు.
మంచు, పొగ వల్లే...
ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, మంచు బాగా కురుస్తుండటం, అదే ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డు చెత్తను తగలబెట్టిన పొగ కమ్ముకొని ఉండటంతో ఆటో డ్రైవర్‌కి ఎదురుగా వస్తున్న లారీ కనబడకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
బంధువుల రోదనలతో దద్దరిల్లిన ఆస్పత్రి...
గుడివాడ టౌన్ : పామర్రు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి దద్దరిల్లింది. భుక్తికోసం ఆటో నడుపుకుంటున్న నాగరాజు, కళాశాలకు వెళ్తున్న రాజేష్, విధి నిర్వహణలో పాల్గొనేందుకు వెళ్తున్న హోంగార్డు గోవర్ధనరావు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంటినుంచి బయలుదేరిన కొద్దిసేపటికే తమవారు మృత్యువాతన పడటాన్ని తట్టుకోలేకపోతున్నారు. కళాశాల విద్యార్థులు రాజేష్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. తమ మిత్రుడిని కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు.