వేసవిలో విద్యుత్ కోతలు ఉండవు | In the summer there are no power cuts | Sakshi
Sakshi News home page

వేసవిలో విద్యుత్ కోతలు ఉండవు

Published Thu, Dec 11 2014 2:48 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

వచ్చే వేసవిలో కూడా కరెంట్ కోతలు లేకుండా చూసేందుకు మూడువేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌..

 ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌జే దొర

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వచ్చే వేసవిలో కూడా కరెంట్ కోతలు లేకుండా చూసేందుకు మూడువేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బయట నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌జె దొర తెలిపారు.  జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఇప్పటికే 24 గంటలు విద్యుత్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల పూర్తి స్థాయిలో విద్యుత్ ఇవ్వలేకపోతున్నామన్నారు.  కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ జూలైలో ప్రారంభించినా కొత్త ప్లాంట్ కావడంతో పూర్తిస్థాయిలో పనిచేయడానికి సమయం పడుతుందని చెప్పారు.

ఈ మధ్య కాలంలో సింహాద్రి ప్లాంట్‌లో వెయ్యి మెగావాట్ల సామర్ధ్యం ఉన్న రెండు యూనిట్లు మరమ్మతుల నిమిత్తం ఆపామన్నారు. హిందుజా ప్లాంట్ ఈ నెలలో అందుబాటులోకి రావాల్సి ఉండగా, హుద్‌హుద్ తుఫాను కారణంగా జాప్యం జరిగిందన్నారు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. హిందుజా పూర్తయితే వచ్చే 1040 మెగావాట్లను మన రాష్ట్రానికే కేటాయించాలని ప్రతిపాదించారన్నారు.  కృష్ణపట్నం రెండో దశ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కేస్-1 బిడ్డింగ్‌లో రిలయన్స్ పవర్‌ప్లాంట్ నాలుగు వేల మెగావాట్లకి టెండర్లు ఆమోదించామని, అయితే న్యాయపరమైన కారణాల వల్ల ఇది ప్రారంభం కాలేదన్నారు. 

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సౌర విద్యుత్ 620 మెగావాట్లకు టెండర్లు ఖరారు చేశామని చెప్పారు. మరో 1500 మెగావాట్లు ఎన్టీపీసీ, జెన్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌జె దొర తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచాలా వద్దా అన్న అంశంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కొత్తగా ఎప్పీడీసీఎల్ పరిధిలోకి అనంతపురం, కర్నూలు జిల్లాలు వచ్చి చేరడం వల్ల అసలు ఉత్పత్తి ఖర్చు ఎంత అవుతుంది, వినియోగం ఎంత, ఎంత ఆదాయం వస్తుందన్న అంచనాలు ఈ నెలాఖరుకి గానీ తయారు కావని చెప్పారు. అవి వచ్చిన తర్వాత టారిఫ్ ఎంత ఉండాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement