సమస్యకు పరిష్కారం లభించినట్టే

Guntur Range IG Solve The Problem At Spandana Program - Sakshi

అర్జీదారునితో ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మాట్లాడిన ఐజీ

వృద్ధాప్య సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశం

సాక్షి, ఒంగోలు : ఆమె వృద్ధురాలు. పేరు ఇండ్ల మల్లీశ్వరీ దేవి. భర్త కృష్ణమూర్తి. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. 8 నెలల కిందట భర్త కన్నుమూశాడు. దీంతో అప్పటినుంచి ఈమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కుమారుడు ఆస్తి పత్రాలు మొత్తం బీరువాలో పెట్టుకొని ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నాడు. మరో వైపు ఆమెకు బీపీ, సుగర్‌ ఉన్నాయి. ఇంజెక్షన్‌ చేయించేందుకు ఆమెను ఇంటికి కూడా రానీయడంలేదు.

దీంతో ఆమె పోలీసు గడప తొక్కడం మొదలుపెట్టింది తనకు న్యాయం చేయాలని. ఇలా ఏడు నెలలు గడిచాయి. స్పందనకు వస్తూనే ఉన్నానంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్‌ స్పందన కార్యక్రమానికి ఫేస్‌బుక్‌ లైవ్‌లోకి వచ్చారు. నేరుగా చీరాల ఇన్‌స్పెక్టర్‌ను లైన్‌లోకి తీసుకొని అతని ఎదురుగా ఉన్న వృద్ధురాలిని నేరుగా సమస్య అడిగి తెలుసుకోవడంతో విషయం వెల్లడైంది. దీంతో తక్షణమే తీసుకోవాల్సిన చర్యలతోపాటు వృద్దుల సంరక్షణ చట్టం కూడా అమలు చేయాలని ఆదేశించారు. దీంతో ఏడు నెలలుగా పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న వృద్ధురాలు మల్లీశ్వరీ దేవి సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆకాంక్ష వ్యక్తం అవుతుంది. 

అధికారులకు దిశానిర్దేశం 
గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌బ్రిజ్‌లాల్‌ స్పందన కార్యక్రమంపై జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ జిల్లాలోని పరిస్థితులను వివరిస్తూ వారంవారం ఫిర్యాదులు పెరుగుతున్నాయని, వాటి పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కారం కోసం మంగళవారం కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం సమావేశం కూడా ఏర్పాటవుతున్న విషయాన్ని వివరించారు.  పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రకాశం పోలీస్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌ కార్యక్రమాన్ని దాదాపు 2 లక్షల మంది ప్రజలు వీక్షించారని వివరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ వృద్ధుల విషయంలో వృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం కూడా చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించి స్పందన కార్యక్రమం తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

మరికొన్ని అంశాలపై ఎస్పీ ఆదేశాలు 
స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీకి 160కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మాట్లాడుతూ గృహహింసకు సంబంధించిన కేసుల విషయంలో సత్వర చర్యలు ఉండాలన్నారు. తాలూకా పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో గృహ హింస కేసు నమోదుచేశారని, అయితే కేసులో నిందితులుగా పేర్కొన్నవారిని బెదిరిస్తున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని, తక్షణమే విచారించి అవసరమైతే నిందితుడ్ని రిమాండ్‌కు పంపాలని  తాలూకా తాత్కాలిక ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటేశ్వరరావును ఆదేశించారు. బల్లికురవకు చెందిన 80 సంవత్సరాల వయస్సుగల అలవల హనుమంతరావు అద్దంకి వరకు వచ్చి అద్దంకి సీఐ అశోక్‌వర్ధన్‌ను కలుసుకున్నారు.

తనకు భూ సమస్య ఉందని, దానిని ఎస్పీతో చెప్పుకుందామంటే తాను ఒంగోలు వరకు వెళ్లలేని స్థితిలో ఉన్నట్లు తెలిపారు. దీంతో ఎస్పీ నేరుగా లైవ్‌లో వృద్ధునితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. మరో వైపు ఒంగోలులో ఇటీవల తరుచుగా  చీటీపాటల పేరుతో మోసాలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు పెరిగిపోతున్నాయని, ఇలాంటి అనధికారికంగా చీటిపాటలు నిర్వహించకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఒంగోలు డీఎస్పీ కెఎస్‌ఎస్‌ఎన్‌వీ ప్రసాద్, టూటౌన్‌ సీఐ ఎం.రాజేష్‌లను ఆదేశించారు. వెంకట్రావు అనే వ్యక్తి తాను చీటీవేశానని, రూ. 5లక్షలు తనను మోసంచేశారంటూ ఫిర్యాదురావడంతో ఎస్పీ ఈ ఆదేశాలు జారీచేశారు. స్పందన కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.మహేంద్రపాత్రుడు, ఎస్‌బీ సీఐలు బాలమురళీకృష్ణ, శ్రీకాంత్‌బాబు, ఐటీ కోర్‌ టీం ఎస్సై నాయబ్‌రసూల్‌ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top