కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు

Ajay Kallam Fires On Ap Govt - Sakshi

‘మేలు కొలుపు’లో మాజీ సీఎస్‌ అజేయ కల్లాం వెల్లడి

పదే పదే అంచనాల పెంపు అందుకే

ఎన్నికల ఖర్చుకు ఖజానా నుంచే దోపిడీ

అడ్వాన్సుల్లోనే అధినాయకుల వాటా వసూలు

కంచే చేను మేస్తే సుపరిపాలనకు తావెక్కడ?

సాక్షి, అమరావతి : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకుల కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం కుండబద్దలు కొట్టారు. ఎన్నికల్లో ఖర్చుకు ప్రభుత్వ ఖజానా నుంచే దోపిడీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని తాను రాసిన ‘మేలుకొలుపు’ పుస్తకంలో ఆయన బహిర్గతం చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ప్రధాన ఉద్దేశం ఎన్నికల ఖర్చు కోసం వీలైనంత త్వరగా డబ్బును భారీ మోతాదులో రాబట్టుకోవడమేనని వెల్లడించారు. ‘మేలుకొలుపు’లో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. 

అధినాయకుల కమీషన్‌ 6 శాతం
‘కమీషన్ల కోసం అంచనాలను పదేపదే మారుస్తూ కేటాయింపులు పెంచుతున్నారు. అధినాయకుల కమీషన్‌ ఆరు శాతమని కార్యాలయాల నడవాల్లో బాహాటంగానే మాట్లాడుతున్నారు. కాంట్రాక్టు చేతికొచ్చిన మరుక్షణమే తొలి ఖర్చుల కోసం అడ్వాన్సుల ఒత్తిడి పెరుగుతుంది. అధినాయకుల వాటా ఆ దశలోనే వసూలవుతోంది. ప్రతి పనికి కాంట్రాక్టర్లగా పేరు పొందిన వారే లేదంటే అందులో ఒకరిద్దరే ఉంటారు. ఇంజనీర్లు వారికి కొమ్ముగాస్తూ తమ వాటాను దండుకుంటూ అధినాయకుల కనుసన్నల్లో  మెలుగుతుంటారు. ఆడిటర్‌ జనరల్‌ తనిఖీల్లో బయటపడకుండా ఉండేందుకు సంబంధిత అధికారులు లొసుగులను పూడ్చేస్తారు. దీన్ని కేవలం బాహ్య లేదా సామాజిక ఆడిట్‌ ద్వారానే నియంత్రించగలం. జరిగిన పనిని వాల్యుయేషన్‌ చేస్తేనే ఖర్చు నిజంగా జరిగిందా లేదా? అనేది తెలుస్తుంది’

రూ.వేల కోట్లు నేతల పాలు
‘తెలుగు రాష్ట్రాల్లో నీటిపారుదల పథకాలకు కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నా చెప్పుకోదగినంత పొలం సాగులోకి రాక రైతులు ఎప్పటిలాగే ఉండగా రాజకీయ నేతలు అంతులేకుండా సంపాదిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా ఆ మేరకు కొత్తగా సాగులోకి రావడం లేదు. అధికార పక్షం, వారిని బలపరచే భాగస్వాములకు ప్రభుత్వ వనరులు వరంగా పరిణమించాయి. అధికారంలో ఉన్నవారు, ప్రభుత్వంలో పనులు కావాల్సిన వారి మధ్య లాలూచీ మొదలైంది. ఈ క్రమంలో నిబంధనలు గాలికి కొట్టుకుపోతున్నాయి. చివరకు అధికార కేంద్రాలు వ్యక్తిగత ప్రయోజనాలు తీర్చుకొనే వ్యవస్థలుగా మారిపోయాయి. విధాన పరమైన నిర్ణయాలు పారదర్శకంగా జరగాల్సిందిపోయి వాటి స్థానంలో తెర వెనుక లావాదేవీలు నిర్వహించే దళారీలు ప్రవేశించారు. ఇలాంటి వాతావరణంలో ప్రభుత్వ ఖజానాను దోచుకునే వ్యక్తులు అవినీతి పరులైన ఉద్యోగులతో చేతులు కలిపి మొత్తం పాలనా వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. కంచే చేను మేస్తే  సుపరిపాలనకు ఇక తావెక్కడ?’ అని తన పుస్తకంలో కల్లాం పేర్కొన్నారు.

వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారు: అజేయ కల్లాం
అనంతపురం కల్చరల్‌: వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్న పాలకులను నిలదీయాల్సిన అవసరం ప్రజలకుందని మాజీ సీఎస్‌ అజేయ కల్లాం అన్నారు. సత్యవేద ప్రభ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం అనంతపురంలోని సూరజ్‌ గ్రాండ్‌ సమావేశ మందిరంలో ఆయన రచించిన ‘మేలుకొలుపు’ (వేకప్‌ కాల్‌) పుస్తకాన్ని  ఆవిష్కరించారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) మాజీ వీసీ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజయ్‌కల్లాం మాట్లాడుతూ తన పుస్తకంలోని ప్రత్యేకతలను వివరించారు. తన చిన్నతనంలో హరిత విప్లవం చూశామని, అప్పట్లో అధికారులు స్వతంత్రంగా వ్యవహరించడానికి వ్యవస్థలు సహకరించాయన్నారు. ప్రస్తుతం వస్తున్న మార్పులు దిగజారుతున్న విలువలకు అద్దం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  అనంతరం కదలిక పత్రిక సంపాదకులు ఇమామ్, సిటిజన్‌ ఫోరం గౌరవాధ్యక్షులు రామిరెడ్డి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, గేట్స్‌ ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల అధినేత వీకే పద్మ, నీటిపారుదలరంగ నిపుణులు పాణ్యం సుబ్రహ్మణ్యం తదితరులు అజయ్‌కల్లం పుస్తక విశిష్టతపై మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అనంతపురం నియోజకవర్గం సమన్వయకర్త నదీం అహ్మద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, ఆచార్య పీఎల్‌ శ్రీనివాసరెడ్డి, ఆచార్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top