మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆర్డీగా గీతా బాయి | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆర్డీగా గీతా బాయి

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

కడప రూరల్‌ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం(జోన్‌–4) రీజనల్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ గీతాబాయి నియమితులయ్యారు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ రీజనల్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ రామ గిడ్డయ్య ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ పొందుతున్నారు. ఈ స్థానంలోకి డాక్టర్‌ గీతాబాయి రానున్నారు.

డాక్టర్‌ నాగరాజుకు ఆర్డీగా పదోన్నతి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పని చేస్తున్న డాక్టర్‌ నాగరాజుకు రీజినల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈయన గుంటూరు(జోన్‌ –3) ఆర్డీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

కడప ఆర్డీగా రావడానికి ప్రయత్నాలు

కాగా కడప ఆర్డీగా డాక్టర్‌ గీతా బాయిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడికి ఆర్డీగా రావడానికి ఒకరు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రయత్నాలు సాగిస్తున్నారు. పెద్ద స్థాయిలో పావులు కదిపితే ఆ అధికారి ప్రయత్నం ఫలిస్తుందని, లేదంటే ఇక్కడికి ఆర్డీగా గీతాబాయి రావడం తథ్యం అనే ప్రచారం సాగుతోంది. ఈ ఊహాగానాలకు ఈ నెల 30తో తెరపడనుంది.

పసికందు మృతదేహంపై విచారణ

కడప అర్బన్‌ : కడప నగరం తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వినాయక నగర్‌ సమీపంలో ముళ్ల పొదల్లో ముక్కుపచ్చలారని పసికందు మృతదేహాన్ని గుర్తుతెలియని వారు పడేసిన సంఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన పవన్‌, సింహాద్రిపురానికి చెందిన దివ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. గర్భవతిగా ఉన్న దివ్య ప్రసవ వేదనతో ఇటీవల పుట్టింటికి వచ్చింది. ఈ నెల 8న దివ్యకు ఫిట్స్‌ రావడంతో కుటుంబ సభ్యుల సహాయంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయింది. అక్కడ నుంచి కడపలో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరింది. ఈనెల 10న ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్య బృందం దివ్య ఆరోగ్య పరిస్థితిని గమనించి ఆపరేషన్‌ ద్వారా మగ బిడ్డను ప్రసవింపచేశారు. అయితే.. అప్పటికే మగబిడ్డ విగత జీవిగా మారిపోయాడు. అదే హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న నరసింహులు చేతికి పసికందు మృతదేహాన్ని తండ్రి పవన్‌ దహన సంస్కారాలు చేయాలని అప్పగించాడు. అందుకు రూ.1500 డబ్బులు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డ్‌ నరసింహులు మద్యం తాగి పసికందు మృతదేహాన్ని వినాయకనగర్‌లోని ముళ్లపొదల్లో పడేశాడు. ఈ మృతదేహాన్ని తమ నోటికి కరిపించుకొని కుక్కలు తీసుకెళ్తూ ఉండగా స్థానిక ప్రజలు గమనించి వెంటపడ్డారు. కుక్కలు మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాయి. ఈ సంఘటన సంచలనం కలిగించింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ సెల్కే నచ్చితే విశ్వనాథ్‌ ఆదేశాల మేరకు కడప ఇన్‌చార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో కడప తాలూకా సీఐ నరసింహారాజు, ఎస్సై రఫీ తమ సిబ్బందితో విచారణ చేపట్టారు. సెక్యూరిటీ గార్డ్‌ నరసింహులును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని ఎస్సై తెలియజేశారు.

పోలీసుల అదుపులో

పరారైన జీవిత ఖైదీ

కడప అర్బన్‌ : ౖవెఎస్‌ఆర్‌ కడప జిల్లా కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తూ ఈనెల 11వ తేదీన తెల్లవారుజామున తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో గూడూరు సమీపంలో ఎస్కార్ట్‌ సిబ్బంది కళ్లుగప్పి పరారైన జీవిత ఖైదీ సాకే రాజ్‌కుమార్‌ను ప్రొద్దుటూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌ ఎస్కార్ట్‌ సిబ్బంది తప్పిదమా? లేక రాజ్‌ కుమార్‌ ఎస్కార్ట్‌ సిబ్బంది కన్నుగప్పి పరారయ్యాడా? అనే విషయంపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టారు. పోలీసు గాలింపు చర్యల్లో ఎట్టకేలకు 24 గంటల్లోపే.. ఖైదీని అదుపులోకి తీసుకోవడం, విచారణ చేపట్టడం జరిగింది. సంఘటనలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement