● రెండేళ్ల దగా.. వీధికెక్కిన విశాఖ
నయవంచనపై
చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, మానవహారాలు, వినూత్న ప్రదర్శనలతో ఆగ్రహావేశం
మాటల గారడీతో మభ్యపెట్టి.. ‘సూపర్’ హామీలతో జనాన్ని బురిడీ కొట్టించి అధికార పీఠమెక్కిన చంద్రబాబు వంచన పర్వానికి రెండేళ్లు నిండాయి. గ్రాఫిక్స్ మాయాజాలం, అనుకూల మీడియా అబద్ధాల ప్రచారంతో సాగుతున్న ఈ రెండేళ్ల కూటమి పాలన.. సామాన్యుడి వీపుపై కత్తులు దింపే ‘నయా వెన్నుపోటు’ జమానాగా మారింది. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి పాతరేసి, దోపిడీకి ఎర్ర తివాచీ పరిచిన పాలకుల తీరుపై విశాఖపట్నం భగ్గుమంది. సంపద సృష్టి పేరిట సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్న మోసకారి పాలనను ఎండగడుతూ.. విశాఖ వీధులు శనివారం నిరసన జ్వాలలతో హోరెత్తాయి. చంద్రబాబు మార్క్ దగాను, రెండేళ్ల ’స్వర్ణాంధ్ర’ మాయాజాలాన్ని ప్రజల కళ్లకు కట్టేలా వైఎస్సార్‌సీపీ శ్రేణులు మహా నగరంలో ఉప్పెనలా ఎగిసిపడ్డాయి. భీమిలి, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో వేలాది మందితో నిర్వహించిన వినూత్న ఆందోళనలు ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. ఎటుచూసినా పసుపు పార్టీ పాలకుల అరాచకాలను ఎలుగెత్తి చాటుతూ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విశాఖపట్నం కదంతొక్కింది. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులను సైతం లెక్కచేయకుండా ప్రజా క్షేత్రంలో పాలకుల వైఫల్యాలను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కడిగిపారేశారు.
– సాక్షి, విశాఖపట్నం


