మధురవాడ: విశాఖ జిల్లాలో పర్యావరణాన్ని నిలువునా నాశనం చేస్తూ.. సీఎం చంద్రబాబు సైకిల్ తొక్కేసి పర్యావరణాన్ని కాపాడాననడం హాస్యాస్పదమని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మరుపిళ్ల పైడిరాజు విమర్శించారు. మధురవాడలో ఆయన మాట్లాడుతూ.. తుర్లువాడ, రాంబిల్లి, శ్రీకృష్ణాపురంలలో డేటా సెంటర్ల పేరుతో 660 ఎకరాల అత్యంత విలువైన భూములను ఎకరం కేవలం 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను నామమాత్రపు ధరకు దోచిపెట్టి విశాఖ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందన్నారు. ఇంతటి విధ్వంసానికి కారణమవుతూ.. ఆంధ్రా యూనివర్సిటీలో ఒక మొక్క నాటి, నోవాటెల్ హోటల్ వరకు సీఎం చంద్రబాబు సైకిల్ తొక్కేస్తే పర్యావరణం కాపాడినట్టేనా? అని నిలదీశారు. ప్రైవేట్ సంస్థలకు భూములు కట్టబెట్టే పద్ధతిని తక్షణమే విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు.


