ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ పునరావాసం, పునర్‌ఉపాధి భూసేకరణ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్‌కు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్‌ఓ అనంతరెడ్డి, ఏఓ సునీల్ ఘన స్వాగతం ఫలికారు. అనంతరం మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం తదితర ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. భూ సేకరణ, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో కందుకూరు, ఇబ్రహీంపట్నం డివిజన్ల ఆర్డీఓలు, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆమనగల్లు, మాడ్గుల తహసీల్దారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


