ఎకరాకు రూ.60 లక్షలిస్తేనే.. | - | Sakshi
Sakshi News home page

ఎకరాకు రూ.60 లక్షలిస్తేనే..

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా

పరిహారం పెంచాల్సిందే

యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్‌ భూముల సేకరణ అంశం మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువను సవరించడంతో ప్రస్తుత వ్యాల్యూ ప్రకారం పరిహారం పెంచాలని పట్టుబడుతున్నారు. గ్రామంలోని అసైన్డ్‌ సర్వేనంబర్లు 19, 68, 127తో పాటు పలు పట్టా సర్వే నంబర్లల్లోని 821.11 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్క్‌ల కోసం సేకరించడానికి ప్రభుత్వం 2025 మార్చి 10న నోటిఫికేషన్‌ ప్రకటించింది. పట్టా భూముల సేకరణను తాత్కాలికంగా పక్కకు పెట్టిన అధికారులు.. ముందుగా 650 ఎకరాల అసైన్డ్‌ భూములు తీసుకోవాలని నిర్ణయించారు. నోటిఫికేషన్‌ వెలువర్చిన ఏడాది తర్వాత 2026 మార్చిలో భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈఏడాది కాలంలో పలు గ్రామాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఏడాది క్రితం యాచారం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎకరా ధర రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఇవే రూ.కోటికి పైగానే పలుకుతున్నాయి. అయితే, పరిహారం చెల్లించి భూములు తీసుకోవాలని బాధిత రైతులు మొదటి నుంచీ స్థానిక అధికారులతో పాటు కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రైతు కమిషన్‌ చైర్మన్‌ ముదిరెడ్డి కోదండరెడ్డిని కలిసి విన్నవించారు.

నేటికీ పూర్తికాని ప్రక్రియ

మొదట్లో ఎకరాకు రూ.22 లక్షల పరిహారం, ఎకరాకు 121 గజాల ప్లాటు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇందుకు రైతులు ససేమిరా అనడంతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి నిర్వాసితులతో సమావేశమై ఎకరాకు రూ.30 లక్షల పరిహారంతో పాటు ఎకరాకు 121 గజాల ప్లాటు, అదనంగా కుటుంబానికి 121 గజాల ప్లాటు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు అంగీకరించారు. భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నెల రోజుల్లో పరిహారం అందజేయాలని కోరారు. కానీ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో భూసేకరణ ప్రక్రియ నేటికీ పూర్తి కాలేదు. రైతుల కబ్జా సర్వే కూడా ఈరోజు వరకూ పూర్తికాలేదు. రికార్డుల్లోంచి నకిలీల పేర్లను కూడా తొలగించలేదు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఏకగ్రీవ తీర్మానం

భూసేకరణకు నోటిఫికేషన్‌ ప్రకటించిన ఏడాది వరకు కూడా పరిహారం అందజేయకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో మొండిగౌరెల్లి రెవెన్యూ పరిధిలో భూముల మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.5,62,500 ఉండగా, ఇటీవల సవరించిన వాల్యూ ప్రకారం రూ.9.84,375 పెరిగింది. దీంతో పరిహారాన్ని కూడా రూ.60 లక్షలకు పెంచి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా మొండిగౌరెల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పెంచిన మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం పెంచి ఇవ్వాలని సర్పంచ్‌ కోలన్‌ రమాదేవి ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేసి తహసీల్దార్‌ అయ్యప్పకు అందజేశారు. ఈ విషయమై కలెక్టర్‌ను కలవనున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.

ఇండస్ట్రియల్‌ పార్కుకు భూములిస్తాం

ఇటీవల పెంచిన మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలి

లేదంటే మరో ఉద్యమం తప్పదు

తేల్చిచెబుతున్న మొండిగౌరెల్లి అసైన్డ్‌ రైతులు

మొండిగౌరెల్లిలోని అసైన్డ్‌ భూములకు పరిహారం పెంచి ఇవ్వాలని రైతులు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన మార్కెట్‌ ధరల ప్రకారం పరిహారం ఇవ్వమని కోరుతున్నారు. పరిహారం పెంపు అంశం మా పరిధిలో లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. వారే నిర్ణయించాల్సి ఉంటుంది. న్యాయం జరిగేలా మా వంతు ప్రయత్నం చేస్తాం. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తాం.

– అయ్యప్ప, తహసీల్దార్‌, యాచారం

ఏడాది కింద నోటిఫికేషన్‌ ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకూ ప్రక్రియ పూర్తిచేయలేదు. త్వరగా సర్వే చేసి పరిహారం అందజేసి ఉంటే రైతులు మరో చోటకు వెళ్లి భూములు కొనుక్కునేవారు. ప్రస్తుతం ఆపరిస్థితి లేదు. సవరించిన మార్కెట్‌ విలువ ప్రకారం అసైన్డ్‌ భూములకు ఎకరాకు రూ.60 లక్షల పరిహారం ఇవ్వాలి. లేదంటే ఏ అధికారినీ గ్రామంలో అడుగు కూడా పెట్టనీయం.

– కోలన్‌ రమాదేవి, సర్పంచ్‌, మొండిగౌరెల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement