ధారూరు: మండల కేంద్రంలోని జామా మసీద్ కమిటీ అధ్యక్షుడిగా ఎండీచాన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మత పెద్దల సమక్షంలో శుక్రవారం అధ్యక్షుడితో పాటు.. ఉపాధ్యక్షుడిగా ఖాజామున్నా ఖురేషి, ప్రధాన కార్యదర్శిగా షఫీ అహ్మద్, మరో 21 మంది సభ్యులను నియమించారు. ఇందులో మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు హఫీజ్, నాయకులు మోయిజ్‌ఖురేషి, ఇబ్రహీం, ఫజిల్ తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రత.. ఆరోగ్య భద్రత
కుల్కచర్ల: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్య భద్రత లభిస్తుందని మండల వైద్యాధికారి కిరణ్‌కుమార్ గౌడ్, బండవెల్కిచర్ల సర్పంచ్ మడుగు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన డ్రైడేలో మాట్లాడారు. ప్రతివారం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఇంటి ముందర, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ కష్టాలు.. పట్టించుకోని పోలీసులు
మోమిన్‌పేట: మోమిన్‌పేట పాత బస్టాండు ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ జాం అవుతోంది. రోడ్డు పైనే ఆటోలు నిలపడం వలన.. ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీంతో ఇతర వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సదాశివపేట వైపు వెళ్తున్న క్రమంలో దర్గా వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని పరిసర ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి రహదారిపై అడ్డదిడ్డంగా ఆటోలు ఇతర వాహనాలను పార్కింగ్ చేయకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, దాంతో పాటే సదాశివపేట మార్గంలోని ఆటో స్టాండును ఉన్న ప్రాంతం నుంచి కాస్త ముందుకు జరపాలని ప్రజలు కోరుతున్నారు.
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
దుద్యాల్: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధి సంట్రకుంట తండా అనుబంధ గ్రామం నన్యానాయక్‌తండాకు చెందిన కవితకు సీఎంఆర్‌ఎస్ చెక్కు అందజేసి మాట్లాడారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఖరీదైన వైద్యం అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని, బాధితులు వినియోగించుకోవాలని సూచించారు. సర్పంచ్ మాణిక్య నాయక్, వార్డు సభ్యుడు సంతోష్, లక్షణ్ పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణకు ఇళ్ల కూల్చివేత
దుద్యాల్: రహదారి విస్తరణలో భాగంగా మండల పరిధి హకీంపేట్‌లో ఇళ్ల కూల్చివేత కొనసాగుతోంది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ రవీంద్ర నర్సింహా రెడ్డి గ్రామస్తులతో మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులను సమన్వయ పర్చగా.. వారు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ఆ బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.


