ఖరీఫ్‌.. కష్టం | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌.. కష్టం

Jun 13 2026 1:29 PM | Updated on Jun 13 2026 1:29 PM

మోమిన్‌పేట: కోటి ఆశలతో ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న కర్షకులకు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఎరువులు ధరలకు రెక్కలు, విత్తనాల నాణ్యత తెలుసుకోలేక సతమవుతూనే.. మార్కెట్లో లభించిన గింజలతో పొలంబాట పట్టిన రైతన్నను.. మృగశిర కార్తె ప్రారంభంలో ప్రతాపం చూపడిన వరుణుడు ముఖం చాటేయడంతో ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. పూర్తిగా వర్షాధార పంటల సాగుకు ఎల్‌నినో దెబ్బతియనుందని వాతావరణ శాఖ తెలపడంతో ఆందోళన చెందుతున్నారు. యాసంగి వడ్లు అమ్ముడుపోక.. ప్రభుత్వ ‘భరోసా’ అందక, ఖరీఫ్‌కు పెట్టుబడి లేక కష్టాల కడలిలో ఎదురీదుతున్నారు.

పశ్చిమాసియా సెగ

పశ్చిమాసియా దేశాల యద్ధం ప్రభావం ఒక్క చమురుపైనే కాదు.. నిత్యావసరాల ధరలను నింగినంటేలా చేసింది. వాటితో పాటు ఎరువుల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్క డీఏపీ ధర మాత్రమే పెరగలేదు. మిగతా అన్ని రకాల కాంప్లెక్సు ఎరువులు బస్తాకు రూ.2 వేల పై మాటే. యూరియా సంగతి చెప్పనక్కర లేదు. యాప్‌ల ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

ఏ రకమో తేల్చలేక

ఏటా వానాకాలం సాగుకు ముందు అన్నదాతలను నకిలీ బెడద పట్టిపీడిస్తోంది. నాసిరకం విత్తనాలతో ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. కేటుగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి జిల్లాలోకి నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నా.. అవి ఏ రకమో తేల్చలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

పెట్టుబడికోసం..

ఖరీఫ్‌, రబీ సాగుకు ముందు ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమచేస్తేనే వారికి పెట్టుబడులకు అందుతాయి. ప్రస్తుతం వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నా.. వారికి భరోసా ఊసు లేదు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావం

అన్నింటికీ ఓర్చి సాగుకు రైతన్న సిద్ధం అవుతున్న నేపథ్యంలో పిడుగులాంటి వార్త ఎల్‌నినో వారి నెత్తిపై పడినట్లు అయింది. సూపర్‌ ఎల్‌నినో రానుందని వ్యవసాయ శాఖ పేర్కొంటుండడంతో రైతుల్లో నిరాశ మొదలైంది. అప్పు చేసి, పెట్టుబడులు పెట్టి, ముందడుగు వేస్తే.. వానలు పడకపోతే.. ఎలా అని మదనపడుతున్నారు. మృగశిర కార్తెలో నైరుతి రుతు పవనాల రాకతో విత్తనాలు విత్తుకొందామంటే విస్తరించడంలో అలసత్వం వహిస్తున్నాయి. ఇన్ని సమస్యల నడుమ ముందుకు సాగుదామా.. కాడిని వదిలేద్దామా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఎరువుల ధర మోత

నకిలీ విత్తనాల బెడద

ముఖం చాటేసిన వరుణుడు

వెంటాడుతున్న ఎల్‌నినో

అందని సర్కారు భరోసా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement