ఆర్టీసీకి 600 కోట్ల అప్పు కావాలి | TSRTC Needs Loan Of 600 Crores | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి 600 కోట్ల అప్పు కావాలి

Dec 31 2022 1:40 AM | Updated on Dec 31 2022 3:58 PM

TSRTC Needs Loan Of 600 Crores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓవైపు ఆదాయం పెరుగు­తున్నా.. మరోవైపు గుట్టలా పేరుకుపోయి ఉన్న పాత బకాయిలు తీర్చటం ఆర్టీసీకి పెద్ద సవాల్‌గా మారింది. వీటిని తీర్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆర్థిక సాయం లేకపోవటంతో అనివార్యంగా అప్పులు తేవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రూ.2270 కోట్ల బ్యాంకు అప్పులు పేరుకుపోయాయి.

మళ్లీ కొన్ని ఇతర బకాయిలు తీర్చేందుకు మరోసారి అప్పు తీసుకోబోతోంది. తాజాగా రూ.600 కోట్ల అప్పుల కోసం రెండు బ్యాంకులతో ఆర్టీసీ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇందులో ఎంత అప్పు మంజూరవుతుందో ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మంజూరైతే కనుక ఆర్టీసీ అప్పులు దాదాపు మూడు వేల రూ.కోట్లకు చేరువవుతాయి.

హైకోర్టు ఆదేశంతో....
ఆర్టీసీలో ఉద్యోగుల సహకార పరపతి సంఘా(సీసీఎస్‌)నిది ప్రత్యేక స్థానం. ఆర్టీసీ నిధులతో ఏమాత్రం సంబంధం లేని ఈ సంస్థ పూర్తిగా ఉద్యోగుల జీతాల నుంచి కేటాయించే మొత్తంతో నడుస్తుంది. వేల రూ.కోట్ల నిధులతో ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప పరపతి సంఘాల్లో ఒకటిగా వెలుగొందింది. అయితే ఆ తర్వాత నష్టాలు, అప్పులతో కునారిల్లుతున్న ఆర్టీసీ ఆ నిధిని సొంతానికి వాడేసుకోవటంతో ఆ పరపతి సంఘం కాస్తా కొరగాకుండా పోయింది. ఇప్పుడు దానికి వడ్డీతో కలుపుకొంటే దాదాపు రూ.900 కోట్లను ఆర్టీసీ బకాయిపడింది.

ఎన్నిసార్లు కోరినా ఆ మొత్తం ఇవ్వకపోవటంతో ఇటీవల ఆ సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మొత్తం బకాయిల్లో రూ.200 కోట్లను ఎనిమిది వారాల్లో చెల్లించాలని మధ్యంతర తీర్పు వెలువరించింది. ఇందులో తొలి వంద రూ.కోట్లు తొలి నాలుగు వారాల్లో చెల్లించాల్సి ఉండగా, తాజాగా ఆ గడువు పూర్తయింది. కానీ డబ్బు మాత్రం చెల్లించలేదు. త్వరలో ఈ కేసు మళ్లీ కోర్టు పరిశీలనకు రాబోతోంది. ఈలోపు డబ్బు చెల్లించని పక్షంలో కోర్టు ధిక్కారం అవుతుంది. దీంతో ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఆర్టీసీకి నెలకొంది.

వేతన సవరణ బకాయిలు రూ.280కోట్లు
మరోవైపు, 2015లో ప్రకటించిన వేతన సవరణకు సంబంధించిన బకాయిల్లో 50 శాతం మొత్తం ఇంకా చెల్లించలేదు. వాటికోసం చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మంత్రులతో జరిగిన చర్చల సందర్భంగా ఈ బకాయి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆ మొత్తాన్ని కూడా త్వరలోనే చెల్లించనున్నట్టు మంత్రులు పేర్కొన్నారన్న వార్తలు కూడా వెలువడ్డాయి.

ఉప ఎన్నిక అయిపోయినా ఆ బకాయి అలాగే ఉండటంతో కొన్ని రోజులుగా ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ బకాయి మొత్తం రూ. 280 కోట్లు కూడా చెల్లించాలని సంస్థ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటికి సంబంధించి నిధులు ఆర్టీసీ వద్ద లేకపోవటంతో మరోసారి బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది.

కొత్త బస్సులకు అప్పులు ఇచ్చిన బ్యాంకులపైనే ఆశ
ఇటీవలే కొత్త బస్సులు కొనేందుకు బ్యాంకుల సాయాన్ని తీసుకున్న ఆర్టీసీ మరోసారి అదే మార్గాన్ని ఎంచుకుంది. ఓ ఏడాది క్రితం వరకు ఆర్టీసీకి అప్పు ఇవ్వాలంటే బ్యాంకులు జంకే పరిస్థితి వచ్చింది. కానీ ఎండీ సజ్జనార్‌ తీసుకున్న కొన్ని సాహసోపేత నిర్ణయాలతో ఆర్టీసీ ఆదాయం మెరుగుపడింది. ఇప్పుడు రోజువారీ టికెట్‌ ఆదాయం సగటు రూ.14.50 కోట్లుగా ఉంటోంది. ఆర్టీసీ లాజిస్టిక్‌ ఆదాయం కూడా పెరిగింది. దీంతో ఆర్టీసీపై బ్యాంకులకు మళ్లీ నమ్మకం పెరిగింది. కొత్త బస్సుల కోసం అడిగిన వెంటనే లోన్‌ ఇచ్చిన బ్యాంకులు ఈసారి కూడా సానుకూలతనే వ్యక్తం చేసినట్టు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement