TSRTC: లాభాల్లోకి రాకుంటే ప్రై‘వేటే’

TSRTC Chairman Bajireddy Sensational Comments Over RTC Privatisation - Sakshi

ఆర్టీసీ అధికారులకు సీఎం హెచ్చరిక 

వెల్లడించిన సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘మరో మూడునాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాకుంటే ప్రైవేట్‌పరం చేస్తాం, తర్వాత మీ ఇష్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించినా పరిస్థితిలో మార్పు చూపకపోవటం ఏంటంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..’ అని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.  

అంతా కలిసి గట్టెక్కించాలి 
‘రాష్ట్రంలో 97 డిపోలుంటే అన్నీ నష్టాల్లో ఉన్నాయంటే అధికారుల పనితీరులో ఎక్కడో లోపం ఉందని స్పష్టమవుతోంది. పరిస్థితి మారకుంటే ప్రభుత్వం ఎంతకాలం నిధులు కేటాయిస్తూ పోతుందనేది సీఎం ఆవేదన. అందుకే ఉన్నతాధికారులు మొదలు డిపో మేనేజర్‌ వరకు అందరి పనితీరు మారాల్సి ఉంది.  సంస్థను గట్టెక్కించే విధంగా వ్యవహరించాలి. అందుకే డిపో స్థాయిలో పరిశీలించాలని నిర్ణయించాం. మరో రెండు, మూడు రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తాం. నేనో వైపు, ఎండీ సజ్జనార్‌ మరోవైపు పర్యటనలు జరిపి లోపాలు గుర్తించి దిద్దుబాటుకు దిగుతాం.

ఒక బస్సు రోజుకు ఇన్ని కి.మీ.లు తిరగాలి అని గతంలో నిర్ధారించారు. దాన్ని గుడ్డిగా పాటిస్తున్న అధికారులు ప్రయాణికులు లేకున్నా తిప్పుతున్నారు. ఇది ఎంత దుబారాకు దారి తీస్తుంది. అలాగే ఒకే డిపోలో ఒకే ప్రాంతానికి ఒకే సారి రెండుమూడు బస్సులు బయలుదేరుతున్నాయి. దీనివల్ల ఏ బస్సులోనూ సరైన ఆక్యుపెన్సీ ఉండటం లేదు. ఇలాంటి లోపాలన్నీ సరిదిద్దాల్సి ఉంది. రెండు మూడు నెలల్లోనే సంస్థను లాభాల్లోకి తేవాలి. లేకుంటే ఆర్టీసీని ప్రభుత్వం భరించడం కష్టం అనేది సీఎం ఉద్దేశం..’ అని బాజిరెడ్డి తెలిపారు.  చదవండి: TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌: కేబినెట్‌ ఆశిస్తే.. కార్పొరేషన్‌

కొత్తగా భర్తీ లేదు .. బస్సుల్లేవు 
‘ఆర్టీసీలో ఇప్పట్లో ఇక కొత్తగా రిక్రూట్‌మెంట్‌ ఉండదని, కొత్త బస్సులు కొనబోమని, కొత్త నిర్మాణాలు చేపట్టబోమని కూడా సీఎం చెప్పారు. అందువల్ల ఉన్న బస్సులనే ప్రణాళికబద్ధంగా వినియోగించుకుంటాం. మరీ అవసరమైతేనే కొత్త బస్సుల కోసం ఆలోచిస్తాం..’ అని చెప్పారు.  

సీఎం ఆగ్రహంపై చర్చ 
రెండేళ్ల కిందట కార్మిక సంఘాలు ఉధృతంగా సమ్మె నిర్వహించిన సమయంలోనూ ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేస్తామని సీఎం హెచ్చరించారు. ఆ సమయంలోనే ఆర్టీసీ ఏకంగా 1,300 అద్దె బస్సులను తీసుకుంది. ఇప్పుడు వాటి సంఖ్య 3,100కు చేరింది. తాజాగా అధికారుల తీరుపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి.. మరోసారి ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించటం సంస్థలో తీవ్ర చర్చకు దారి తీసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top