వామ్మో.. పులి; ఆ వీడియో పాతది

Tiger Kills An Ox At Bhadradri Kothagudem - Sakshi

పశువుల పాకపై దాడి.. 

ఎద్దును చంపిన వైనం 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/గుండాల: జిల్లాలోని గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో రెండు, మూడు రోజులుగా పులి సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి ఆళ్లపల్లి మండలంలో ఓ పశువుల పాకపై దాడి చేసి దుక్కిటెద్దును చంపేసింది. గురువారం రాత్రి దామరతోడు అటవీ ప్రాంతం నుంచి కరకగూడెం మండలం అనంతారం అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించిన స్థానికులు ఏడూళ్ల బయ్యారం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.  శనివారం ఉదయం ఆళ్లపల్లి మండలం రాయిగూడెం పోడు భూముల సమీపంలో పులి కనిపించిందని అక్కడి గ్రామస్తులు తెలిపారు.  
(చదవండి: పులి హల్‌చల్‌)

ఆ పులి వీడియో పాతది: అటవీశాఖ 
సాక్షి, హైదరాబాద్‌: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని, పశువుల కాపరులకు కనిపించిందని శుక్రవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన వీడియో పాతదని, ఈ ప్రాంతానికి సంబంధించినది కాదని అటవీ శాఖ స్పష్టం చేసింది. ఈ వీడియోపై విచారణ చేపట్టిన అటవీ అధికారులు అది మహారాష్ట్రకు చెందిన పాత వీడియోగా నిర్ధారించారు. యావత్‌మల్‌ జిల్లా అంజన్‌వాడి అటవీ ప్రాంతంలో గత నెలలో కనిపించిన పులి వీడియోను కొందరు బెజ్జూరు ప్రాంతంలో పులి అంటూ వాట్సాప్‌ ద్వారా సర్క్యులేట్‌ చేశారని ఆదిలాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌) వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. తప్పుడు సమాచారంతో చేస్తున్న ప్రచారం వల్ల స్థానిక గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. పులుల సంచారంపై శాఖాపరంగా అప్రమత్తంగా ఉన్నామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాలోనే 32 ప్రత్యేక బృందాలతో పులుల కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.
(చదవండి: అది ఫేక్‌ వీడియో: కేసులు పెడతాం!)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top