హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు | Telangana High Court shocks Hydra on demolitions | Sakshi
Sakshi News home page

హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Apr 14 2026 2:18 AM | Updated on Apr 14 2026 7:25 AM

Telangana High Court shocks Hydra on demolitions

సాక్షి, హైదరాబాద్‌: హైడ్రాకు ఉన్నత న్యాయస్థానం భారీ షాక్‌ ఇచ్చింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు జలాశయాలు, నాలాలు, పార్కులు, ఆక్రమణల తొలగింపు, ప్రజా రహదారుల పునరుద్ధరణ మినహా అనధికార నిర్మాణాల కూల్చివేత లేదా తొలగింపునకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ, పురపాలక సంఘాల చట్టం, ఇతర నిబంధనలకు అనుగుణంగా ప్రామాణిక కార్యాచరణ విధానాలు, మార్గదర్శకాలను సమర్పించాలని స్పష్టం చేసింది. 

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఐలాపూర్‌ గ్రామంలో హైడ్రా ఓ యుద్ధ వాతావరణాన్ని సృష్టించినట్లు అభిప్రాయపడింది. పెత్తందారీ విధానం, చట్టవిరుద్ధ చర్యల కారణంగా వందలాది పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పింది. చాలా పిటిషన్లలో స్పష్టమైన కౌంటర్లు దాఖలు చేయలేదని, సంస్థ తీరు సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది. ఐలాపూర్‌ కూల్చివేతలపై స్టేటస్‌కో ఆదేశాలు పాటించాలని చెబుతూ విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.  

వెయ్యి ఎకరాల కబ్జాకు యత్నం: ఏఏజీ 
అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘సంగారెడ్డిలోని కోర్టు ఇచ్చిన డిక్రీని అడ్డుపెట్టుకుని ఐలాపూర్‌లో పలు సర్వే నంబర్లలోని వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి పిటిషనర్‌ ప్రయత్నిస్తున్నారు. హైడ్రా కూల్చివేసిన భవనం ప్రభుత్వ భూమిలో నిర్మించిందే. ఆ భవనానికి విద్యుత్, నిర్మాణ అనుమతులు లేవు’అని చెప్పారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘కూల్చివేసిన భవనం కోర్టు విచారణలో ఉన్న ఆస్తిలోని ఓ భాగం. ఆ కేసులోనే వివాదాస్పద డిక్రీ జారీ అయ్యింది. 2006లో నాటి ఉమ్మడి ప్రభుత్వంపై పిటిషనర్‌ ఈ దావా వేశారు. 

అలాగే, 2024లో ప్రతివాద అధికారులు జోక్యం చేసుకున్నప్పుడు పిటిషనర్‌ రిట్‌ పిటిషన్‌ కూడా వేశారు. రిట్‌ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సంబంధిత స్థలంలో ప్రస్తుతమున్న నిర్మాణాలను తొలగించడానికి, చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది పట్టించుకోకుండా హైడ్రా అధికారులు ఈ నెల 11న తెల్లవారుజామున 4 గంటలకు పిటిషనర్‌ స్థలానికి వచ్చి భవనాన్ని కూల్చివేశారు. 2005లో అధికారులు ఇచ్చిన అనుమతి మేరకే భవనాన్ని నిర్మించారు. (భవన కూల్చివేత వీడియో దృశ్యాలను కూడా న్యాయస్థానం ముందు ప్రదర్శించారు). వాదనలు విన్న న్యాయమూర్తి సుదీర్ఘ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు.  

నోటీసులు జారీ చేయకుండా.. 
‘పిటిషనర్‌ న్యాయవాది సమర్పించిన వీడియోను పరిశీలిస్తే.. హైడ్రాకు చెందిన వందలాది మంది సిబ్బంది ఆ స్థలంలో గుమిగూడినట్లు స్పష్టమవుతోంది. పిటిషనర్‌కు చెందిన భారీ భవనం కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఇంత భారీ నిర్మాణాన్ని కూల్చివేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనుమతి లేకుండా భవనాన్ని నిర్మించారని భావించినా, ఇంత భారీ నిర్మాణం చేపట్టే వరకు అధికారులు ఏం చేస్తున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. అనధికార నిర్మాణాన్ని గమనించి ప్రారంభంలోనే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి చక్కబడి ఉండేది. దానికి బదులుగా.. అధికారులు కళ్లు మూసుకుని, ఓ భారీ నిర్మాణం జరగడానికి అనుమతించి.. ఇప్పుడు నిర్మాణం అక్రమమంటూ న్యాయస్థానం ముందు ఫిర్యాదు చేస్తున్నారు’అని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.  
ప్రామాణిక విధానమేదీ... 
‘ఏదేమైనా అనుమతి లేకున్నా ఓ భవనాన్ని కూల్చివేసే సమయంలో సహజ న్యాయ సూత్రాలు పాటించాల్సిందే. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నట్లు.. యుద్ధ వాతావరణాన్ని తలపించేలా హైడ్రా సిబ్బందిని మోహరించింది. ఇది సహించరానిది. ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించిన తర్వాత హైడ్రా ఎలాంటి ప్రామాణిక పద్ధతులను పాటించడం లేదని న్యాయస్థానం ప్రాథమికంగా అభిప్రాయపడుతోంది. యాజమాన్య హక్కుకు సంబంధించి వివాదమున్న సందర్భాల్లో అవతలి పక్షానికి నోటీసు జారీ చేసిన తర్వాతే చర్యలు చేపట్టాలి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా కూల్చివేతలు చేపట్టామని హైడ్రా వాదిస్తూ తన చర్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోంది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో అనేక జలాశయాలను పునరుద్ధరించినట్లు హైడ్రా గర్వంగా ప్రచారం చేసుకుంటోంది. 

హైడ్రా.. పెత్తందారీ చర్యలకు వ్యతిరేకంగా వందలాది కేసులు దాఖలయ్యాయన్నది వాస్తవం. అలాంటి పిటిషన్లలో హైడ్రా ఎలాంటి ప్రామాణిక విధానాన్ని అనుసరించలేదు. హైడ్రా ఏర్పడి ఏడాదైనా జీహెచ్‌ఎంసీ లేదా పురపాలక సంఘాల చట్టంలోని నిబంధనలను అనుసరిస్తోందా? లేదా? అనేది తెలియడం లేదు. ఆ సంస్థ చర్యలు చట్టానికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు సదరు ఆస్తి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలి. జీహెచ్‌ఎంసీ, పురపాలక సంఘాల చట్టం, ఇతర వర్తించే నిబంధనలు, నియమాలకు అనుగుణంగా ప్రామాణిక కార్యాచరణ విధానాలు, మార్గదర్శకాలను హైడ్రా ఈ కోర్టు ముందుంచాలి. అప్పటివరకు అనధికార నిర్మాణం, అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు లాంటి చర్యలను హైడ్రా చేపట్టవద్దు’అని న్యాయమూర్తి ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.   

నకిలీ నోటీసులపై ఫిర్యాదు
తెలంగాణ హైకోర్టు పేరిట హైడ్రాకు నకిలీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్‌ రంగనాథ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. 

రిస్క్‌ చేయాల్సిందే!
ఫాతిమా కాలేజీ విషయంలో దాఖలైన ఓ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సల్కం చెరువులో కాలేజీ నిర్మించారని.. ఇంతదాకా హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ పిటిషన్‌ దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం.. ఫాతిమా కాలేజీలో జాయిన్‌ అయ్యేవాళ్లు రిస్క్‌ చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాలేజీ నోటీసు బోర్డులో ఈ విషయాన్ని పేర్కొనాలంటూ కాలేజీ యాజమాన్యాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement