Telangana: ఇంగ్లిష్‌కూ ప్రాక్టికల్స్‌! 20 నుంచి 25 మార్కులు?

Qualitative changes in intermediate education telangana - Sakshi

వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌  

ఉండేలా ప్రతిపాదనలు సిలబస్‌లో మార్పులు

జేఈఈ, నీట్‌ రాసే సామర్థ్యంతో బోధన

మార్చి 15 కల్లా అఫిలియేషన్‌ పూర్తి

‘సాక్షి’తో ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌లో వచ్చే ఏడాది నుంచి గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. జాతీయస్థాయిలో పోటీ పడేలా సరికొత్త విధానాలను అనుసరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా తాము వేసిన కమిటీ కసరత్తు ముమ్మరం చేసిందన్నారు. ‘సాక్షి’తో మంగళవారం నవీన్‌ మిత్తల్‌ ప్రత్యేకంగా మాట్లాడారు.

‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యావిధానంలో మార్పులు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే తెలంగాణ కాలేజీ విద్యను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఉన్నత విద్యకు కీలకమైన ఇంటర్మీడియెట్‌లో అత్యున్నత ప్రమాణాలు తెచ్చే ప్రయత్నం కీలక దశకు చేరుకుంది. ఉన్నత విద్యలో ఇప్పటివరకు కేవలం విద్యార్థి మెమరీని గుర్తించడానికి పరీక్ష పెట్టారు. ఇక నుంచి వారిలోని సృజనాత్మకత, ఆలోచన విధానం వెలికితీసేలా పరీక్ష తీరు ఉండాలని నిపుణులు భావిస్తున్నారు. దీనికి అనుసరించాల్సిన విధానాలపై ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తో కమిటీ వేశాం. మరికొన్ని నెలల్లోనే ఇది తమ ప్రతిపాదనలను సమర్పిస్తుంది’ అని చెప్పారు. 

ఇంగ్లిష్‌ ఉచ్ఛారణపై అవగాహన పెంపు 
ఇంటర్‌లో ఇప్పటివరకు సైన్స్‌ సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌ ఉండేవని, ఇక నుంచి ఇంగ్లిష్‌ సబ్జెక్టుకూ దీన్ని విస్తరించాలని బోర్డ్‌ నిర్ణయించిందని నవీన్‌ మిత్తల్‌ చెప్పారు. ఇది ఏ విధంగా ఉండాలనేదానిపై వివిధ వర్గాల సలహాలు, సూచనలు తీసుకున్నామని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇంగ్లిష్‌లో మాట్లాడటాన్ని ప్రాక్టికల్‌గా భావిస్తారని, దీనికి 20 నుంచి 25 మార్కులు ఉండే అవకాశముందన్నారు. ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్‌ పెట్టడం వల్ల మొదట్నుంచీ ఇంగ్లిష్‌ ఉచ్ఛారణపై విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంటర్‌ సిలబస్‌పై సిలబస్‌ కమిటీని నియమించామని, ఇటీవలే ఈ కమిటీతో భేటీ జరిగిందని చెప్పారు. రాష్ట్ర సిలబస్‌ చదివిన విద్యార్థి జాతీయస్థాయి పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్, కామన్‌ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలను తేలికగా రాసేలా సిలబస్‌ రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. చరిత్ర విషయంలో రాష్ట్ర చరిత్రకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని, సైన్స్‌ సబ్జెక్టుల్లోనే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను మేళవించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఉపాధి అవకాశాలున్న అనేక కోర్సుల మేళవింపు, ఏయే సబ్జెక్టుల్లో ఎంత వరకు పాఠాలు అవసరం అన్నది పరిశీలించి మార్పు చేస్తామన్నారు.  
 
జనవరి 18 నుంచి అఫిలియేషన్లు 
ప్రైవేటు ఇంటర్‌ కాలేజీల అఫిలియేషన్‌ విషయంలో గతంలో మాదిరి ఆలస్యం చేయకూడదని నిర్ణయించినట్లు నవీన్‌ మిత్తల్‌ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ ప్రక్రియను జనవరి 18 నుంచి మొదలుపెడతామని, మార్చి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏప్రిల్‌ 15 నాటికి అనుబంధ గుర్తింపు జాబితాను ప్రకటిస్తామన్నారు.

ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు అంశాన్ని పరిగణనలోనికి తీసుకోబోమని తేల్చిచెప్పారు. దీనివల్ల ఇంటర్‌ విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు ఉండబోవని తెలిపారు. పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇంటర్‌లో మరికొన్ని మార్పులకు అవకాశం లేకుండా పోయిందని, వచ్చే సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్‌ విషయంలో జంబ్లింగ్‌ విధానం అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top