కాసుల కోసమే కృత్రిమ కొరత? | Petrol, Diesel Artificial shortages for money | Sakshi
Sakshi News home page

కాసుల కోసమే కృత్రిమ కొరత?

Apr 28 2026 2:16 AM | Updated on Apr 28 2026 2:16 AM

Petrol, Diesel Artificial shortages for money

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వాహన చోదకులతో కిక్కిరిసిన ఓ పెట్రోల్‌ బంకు

బెంగాల్‌ రెండోదశ పోలింగ్‌ తర్వాత భారీగా పెట్రో చార్జీలు పెంచుతారని ప్రచారం 

అందుకే బంకులకు చమురు సంస్థలు సరఫరా తగ్గించినట్లు ఆరోపణలు

ధరలు పెరిగాక అమ్మకానికి డీలర్లు సైతం పెట్రోల్, డీజిల్‌ నిల్వ చేస్తున్న వైనం 

ఫలితంగా హైదరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లో వాహనదారులకు తప్పని పెట్రో కష్టాలు 

కొరత లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. చమురు సంస్థలే ఇవ్వట్లేదంటున్న డీలర్లు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మళ్లీ ఇంధన కొరత ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు, వ్యవసాయ అవసరాల కోసం రైతులు పెట్రోల్, డీజిల్‌ కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్‌ సహా ప్రధాన పట్టణాలు, జిల్లాల్లోని పలు పెట్రోల్‌ బంకుల ముందు కార్లు, టూవీలర్ల క్యూలు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నాయి. తెరిచిన పెట్రోల్‌ బంకుల వద్ద వాహనాలను క్రమబదీ్ధకరించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు శ్రమిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ లిబర్టీ వద్ద గల ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఏకంగా ఎస్సై స్థాయి అధికారితోపాటు ట్రాఫిక్‌ పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ కనిపించారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ పెట్రోల్, డీజిల్‌ కొరత లేదని చెబుతుండగా మరి బంకుల్లో ‘నో స్టాక్‌’బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. డీలర్ల సంఘం మాత్రం చమురు కంపెనీల వల్లే పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడిందని ఆరోపిస్తుంది. 

నష్టాలు తగ్గించుకొనే వ్యూహం? 
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగ్గా దేశంలో మాత్రం ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పెట్రో చార్జీల పెంపు జోలికి వెళ్లలేదు. దీంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), హిందుస్తాన్‌ పెట్రోలియం (హెచ్‌పీ), భారత్‌ పెట్రోలియం (బీపీ) తీవ్ర నష్టాలు చవిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో రెండోదశ పోలింగ్‌ ప్రక్రియ ఈ నెల 29న సాయంత్రం ముగుస్తుండటంతో ఆ వెంటనే పెట్రోల్, డీజిల్‌ ధరలను భారీగా పెంచే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సంకేతాలు ముందే అందడంతో చమురు సంస్థలు ఇప్పటి నుంచే నష్టాలను నివారించుకొనే ప్రయత్నం చేస్తున్నాయని.. అందులో భాగంగానే సరఫరాను తగ్గించి ‘కృత్రిమ కొరత’సృష్టిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీలర్లు పెట్టిన ఇండెంట్‌ ప్రకారం కాకుండా కావాలనే తగ్గించి పెట్రోల్, డీజిల్‌ సరఫరా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఏపీలో కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌కు తీవ్ర కొరత నెలకొనడంతో రాష్ట్రంలోని వాహనదారులు ముందుజాగ్రత్తగా తమ వాహనాలను ట్యాంక్‌ ఫుల్‌ చేయించుకోవడానికి బంకుల ముందు క్యూకట్టడం వల్ల కూడా ఇంధనం ముందే నిండుకుంది. దీంతో చాలా చోట్ల బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

డీలర్ల గోల్‌మాల్‌తో పెరిగిన కొరత.. 
రెండ్రోజుల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో కొందరు డీలర్లు ఇంధన కొరత పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బంకుల్లో స్టాక్‌ ఉన్నప్పటికీ ధరలు పెరిగాక విక్రయించి మరింతగా సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో కొందరు డీలర్లు కావాలనే పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం వరకు లేని ఇంధన కొరత సోమవారం ఒక్కసారే కనిపించడం వెనుక డీలర్ల ‘ముందు చూపు’కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాము డబ్బు చెల్లించినప్పటికీ చమురు సంస్థల నుంచి ఇంధనం రావట్లేదని డీలర్ల సంఘం నేత అమరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కంపెనీల సరఫరా గొలుసులో లోపాల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. 

ఇంధన కొరత లేదు: పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ 
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలోని తప్పుడు వార్తలు, వదంతులను నమ్మొద్దని.. ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వివరించారు. పౌర సరఫరాల కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో అధికారులు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 4 గంటల వరకు రాష్ట్రంలో 74.43 లక్షల లీటర్ల పెట్రోల్, 1.10 కోట్ల లీటర్ల డీజిల్‌ సరఫరా అయిందన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా బాధ్యతగా వ్యవహరించాలని.. అవసరానికి మించి ఇంధనం కొని నిల్వ చేయొద్దని సూచించారు. బంకుల సిబ్బంది, పోలీసులకు సహకరించి రద్దీని నివారించాలని కోరారు. కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు లేదా భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు, సమస్యల కోసం 1967 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలన్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement