కట్టుబాటు పొమ్మంది.. వల్లకాడు రమ్మంది

People Not Accept To Dead Body to Villages In Yellandu - Sakshi

శవాన్ని ఇంటికి తీసుకురానివ్వని కులపెద్దలు

సాక్షి, ఇల్లెందు : బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కుల కట్టుబాట్ల పేరుతో తన ఇంటికి రానివ్వకుండా కులపెద్దలు అడ్డుకోవడంతో కుటుంబసభ్యులు రాత్రంతా శ్మశానవాటికలోనే జాగారం చేసిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం విజయలక్ష్మీనగర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయలక్ష్మీనగర్‌ ఏరియాకు చెందిన శానం వేణుగోపాల్‌ (56), హైమావతి దంపతులు హైదరాబాద్‌కు పదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చారు. వేణు ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వేణు బుధవారం విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఆయన స్వస్థలం విజయలక్ష్మీనగర్‌లోని ఇంటికి తీసుకురాగా.. వేణుకు కులంతో సత్సంబంధాలు తెగిపోయాయని, కుల కట్టడి చెల్లించని కారణంగా మృతదేహాన్ని గ్రామంలోకి గానీ, ఇంటికి గానీ తీసుకురావొద్దని కులపెద్దలు ఆంక్షలు విధించారు. దీంతో శ్మశాన వాటికలో గల డంపింగ్‌ యార్డు షెడ్డులో మృతదేహాన్ని దింపి.. కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రంతా చలిలోనే శవ జాగారం చేశారు.

అంత్యక్రియలకు చొరవ చూపిన ప్రజాప్రతినిధులు
వేణు మృతదేహాన్ని గ్రామంలోనికి రానివ్వడంలేదన్న సమాచారం అందుకున్న అక్కడి సర్పంచ్‌ కవిత, ఎంపీటీసీ సభ్యుడు సురేందర్, ఉప సర్పంచ్‌ తాండ్ర నాగరాజు, వార్డు సభ్యులు శ్మశాన వాటిక వద్దకు చేరుకుని జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న మీడియా కూడా అక్కడికి చేరుకోవడంతో కుల పెద్దలు తమ బండారం బయటపడుతుందని భావించి మెల్లగా జారుకున్నారు. అనతరం కరోనాతో మృతి చెంది ఉంటాడని భావిచడం వల్లే గ్రామంలోనికి రానివ్వలేదని కులపెద్దలు మాటమార్చి అంత్యక్రియలకు హాజరయ్యారు.

అత్త ఉసురుతీసిన కోడలు
ఖిల్లాఘనపురం (వనపర్తి): తరచూ తగాదాలు పెట్టుకుంటోందంటూ ఓ కోడలు గుళికలమందు తాగించి అత్తను హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని అప్పారెడ్డిపల్లికి చెందిన పెంటమ్మ (67) తన ఒక్కగానొక్క కుమారుడు శేషయ్యకు మంగనూరు వాసి నాగమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం చేసింది. సుమారు ఐదేళ్ల క్రితం కుమారుడు మృతి చెందడంతో కోడలు, ఇద్దరు మనవళ్లతో కలిసి జీవిస్తోంది. అయితే కుటుంబ విషయాలపై అత్త తరచూ తగాదాలు పెట్టుకుంటోందని ఆగ్రహించిన నాగమ్మ బుధవారం ఉదయం తన కుమారుడు నరేశ్‌తో ఖిల్లాఘనపురం నుంచి గుళికలమందు తెప్పించింది. అనంతరం నీటిలో కలిపి అత్తకు తాగించింది. పెంటమ్మ వాంతులు చేసుకోవడం చుట్టుపక్కల వారు గమనించి మహబూబ్‌నగర్‌లోని జనరల్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై గురువారం మృతురాలి అన్న జుర్రు పెంటయ్య ఫిర్యాదు మేరకు కొత్తకోట సీఐ మల్లికార్జున్‌రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top