సాక్షి, జగిత్యాల: జగిత్యాల బీఆర్‌ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి జగిత్యాల జైత్రయాత్రను తలపించేలా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కూడా ఉండబోతోందన్నారు. రాజకీయంగా తాను విభేదించినా కేసీఆర్ మాత్రం తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఈ విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నట్టు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మేడిగడ్డ ప్రాజెక్టుతో మాత్రమే తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుంది. తుమ్మిడిహట్టి కట్టాలని నేను డిమాండ్ చేసిన మాట వాస్తవమే. కానీ, కాళేశ్వరంతో పెద్ద సంఖ్యలో రైతాంగానికి మేలవుతుంది. మళ్లీ తుమ్మిడిహట్టి నిర్మాణం కావాలన్నా కేసీఆర్ రావాల్సిందే. మేడిగడ్డ మీద ఎన్డీఎస్ఎఫ్ రిపోర్ట్ ఇచ్చి ఏడాదైతే గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నాడు. పునరుద్ధరణ ఎప్పుడు పూర్తి అవుతుంది? అని ప్రశ్నించారు.
అలాగే, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం నా రాజకీయ భవిష్యత్తుపై మనస్థాపం చెందాను. రాజకీయంగా నేను విభేదించినా కేసీఆర్ పెద్ద మనసులో నన్ను అక్కున చేర్చుకున్నారు. ఇవాళ నేను సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైన తెలంగాణా పరిస్థితులపై ఈరోజు సభ ఉండబోతోంది. జగిత్యాల బీఆర్‌ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. జగిత్యాల బీఆర్ఎస్ సభపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. తనను బీఆర్ఎస్ నేతలు క్రాస్ బ్రీడ్ అని సంబోధించడంపై మండిపడ్డారు. తాజాగా సంజయ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ..‘జగిత్యాల సభతో ఒరిగేదేమీ లేదు. కేసీఆర్, కేటీఆర్‌ను వందల సార్లు తిట్టిన జీవన్ రెడ్డి చేరికపై ప్రజలందరికీ స్పష్టత ఉంది. బీఆర్ఎస్ సభకు నాకు ఆహ్వానం లేదు. నేను మేడిగడ్డకు ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తున్నాను. నా చివరి అంకం వరకు ఇక కాంగ్రెస్‌తోనే నా ప్రయాణం’ అని వ్యాఖ్యలు చేశారు.


