రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు
ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు
రానున్న మూడ్రోజులు ఇంకా పెరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణంగా మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానుండగా... ఈసారి ముందస్తుగానే నమోదవుతున్నాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మరోవైపు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కుమ్రుం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని చెప్పింది.


