హైదరాబాద్: నగరంలోని 2 ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. నారాయణగూడ వైఎంసీఏ దగ‍్గర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు ఆటోలు దగ్ధమయ్యాయి. ఆటోలో గ్యాస్ ఫిల్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆటోకు కూడా మంటలు అంటుకుని అది దగ్ధమైంది. మంటలను సిబ్బంది అదుపు చేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఒకరికి గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు, పాతబస్తీ బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జూ పార్క్ సమీపంలో ఉన్న తాడ్‌బన్‌లోని స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.


