సిరిసిల్ల: ప్రభుత్వ ఉద్యోగం ఒకటి సాధించడమే కష్టంగా ఉన్న నేటి పోటీ ప్రపంచంలో పట్టుదలకు ప్రయత్నం తోడైతే విజయాలు క్యూ కడతాయని నిరూపిస్తున్నారు సిరిసిల్ల అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) బేర పృథ్వీరాజ్‌వర్మ. ఒక్కటి కాదు...రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. చదువు ఒక్కటే మనల్ని ముందుకు నడిపిస్తుందని.. సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏఎంవీఐగా పనిచేస్తున్న పృథ్వీరాజ్‌వర్మ గ్రామీణ నేపథ్యంలో ఎదిగి వచ్చి “ఖాకీ’ యూనిఫామ్‌పై ఉన్న మక్కువతో మూడు ఉద్యోగాలు సాధించారు. ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం ఖాకీ దుస్తులకే ఉందని నమ్మారు. ఉద్యోగ అన్వేషణలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నేటితరం యువతకు స్ఫూర్తినిస్తున్న పృథ్వీరాజ్‌వర్మ విజయగాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
మధ్యతరగతి కుటుంబం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లికి చెందిన బేర శ్రావణి, రాజమౌళి దంపతులకు ఇద్దరు కొడుకులు పృథ్వీరాజ్‌వర్మ, భరద్వాజ్. లక్షెట్టిపేటలో ఎస్‌ఎస్‌సీ వరకు చదివిన పృథ్వీరాజ్‌వర్మ పదోతరగతిలో 526 మార్కులు సాధించారు. హైదరాబాద్‌లో ఇంటర్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. 2017లో బీటెక్ పట్టాతో బయటకు వచ్చిన పృథ్వీరాజ్‌వర్మ హోండా కంపెనీలో సర్వీసు ఇంజినీరుగా రెండేళ్లపాటు పనిచేశారు. అనంతరం మరో సిమెంట్ కంపెనీలో పనిచేశారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలగా ఖాళీ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.
బీట్ ఆఫీసర్‌గా ప్రస్తానం
2019లో పోటీపరీక్షలు రాసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా తొలి ఉద్యోగం సాధించారు. శిక్షణ అనంతరం జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో ఉద్యోగం. అడవిని, వన్యప్రాణులను రక్షించే ఉద్యోగం. బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సిద్దమయ్యారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ మోటార్ వాహన తనిఖీ అధికారి(ఏఎంవీఐ) ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షలకు పట్టుదలగా ప్రిపేర్ అయ్యారు. ఆ పరీక్షల ఫలితాలు రాక ముందే 2024లో పోలీస్ కానిస్టేబుల్(సివిల్) ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. కానిస్టేబుల్ ఉద్యోగం చేరకుండా.. ఏఎంవీఐ ఉద్యోగ ఫలితాల కోసం నిరీక్షించారు. ఉద్యోగం పోతుందని, వెంటనే చేరాలని అనేక మంది సలహా ఇచ్చినా అప్పటికే ఓ ఉద్యోగం ఉంది, మరో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను అనే ధీమాతో ఉండగా.. ఏఎంవీఐగా ఎంపికయ్యారు. మూడు ఖాకీ డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు రావడంతో చివరగా.. ఏఎంవీఐగా ఉద్యోగంలో చేరారు.
తమ్ముడూ.. భార్యా ఇంజినీర్లే
పృథ్వీరాజ్‌వర్మ తమ్ముడు భరద్వాజ ఆర్‌అండ్‌బీలో ఏఈఈగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కీర్తి ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నారు. ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడంతో తల్లిదండ్రులు శ్రావణి, రాజమౌళి దంపతుల ఆనందానికి అవధుల్లేవు. చిన్నప్పటి నుంచి చదువు ఒక్కటే దారి చూపుతుందని నమ్మిన ఆ తల్లిదండ్రులు పిల్లలను ప్రయోజకులను చేశామని ఆత్మసంతృప్తితో ఉన్నారు.
వెనకడుగు వేయొద్దు
పట్టుదలగా చదువాలి. చదువును నిర్లక్ష్యం చేయొద్దు. వెనకడుగు వేయొద్దు. నిజా నికి బీట్ ఆఫీసర్‌గా ఉండగా మళ్లీ చదువు ఎందుకు అని చాలా మంది సలహా ఇచ్చా రు. ఉన్న ఉద్యోగం పోతుందన్నారు. అప్పటికే పోటీపరీక్షల పేపర్లు లీక్ కావడం, రాసిన పరీక్షలు రద్దు కావడం జరిగింది. దీంతో చాలా మంది ఉన్న ఉద్యోగంలోనే చేరమన్నారు. కానీ మనపై మనకు నమ్మకం ఉంటే.. ఇది పోతే ఇంకోటి వస్తుందిలే అనే ధీమాతో రెండేళ్లు ఇంటి ముఖం చూడకుండా హైదరాబాద్‌లోనే ఉండి చదువుకున్న. కృషికి తోడుగా.. పట్టుదల ఉంటే.. ఏదైనా సాధిస్తామనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతోనే మూడు ఉద్యోగాలు సాధించాను. అన్ని ఖాకీ యూనిపామ్ సర్వీసులే కావడం ఆనందం అనిపించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. చదువును మరువద్దు.
– పృథ్వీరాజ్‌వర్మ, ఏఎంవీఐ, రాజన్న సిరిసిల్ల


