కేరళలో కమ్యూనిజం పోయి.. గూండాయిజం వచ్చింది | Deputy CM Bhatti Vikramarka Election Campaign In Kerala | Sakshi
Sakshi News home page

కేరళలో కమ్యూనిజం పోయి.. గూండాయిజం వచ్చింది

Apr 5 2026 1:11 AM | Updated on Apr 5 2026 1:11 AM

Deputy CM Bhatti Vikramarka Election Campaign In Kerala

కేరళ ప్రచారంలో భట్టి విక్రమార్క

మెరుగైన పాలన కోసం యూడీఎఫ్‌ అభ్యర్థులను గెలిపించండి 

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి  

సాక్షి, హైదరాబాద్‌: కేరళలో పాలన, మానవీయ విలువలు దారుణంగా పడిపోయాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు. కేరళ అంటే కమ్యూనిజం, మార్క్సిజం గురించి మాట్లాడుతారు కానీ అది నేడు పక్కకు పోయి గూండాయిజం మాత్రమే కనిపిస్తోందని దుయ్యబట్టారు. గత ఎన్నికల ముందు ఎల్‌డీఎఫ్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈనెల 9న జరుగనున్న ఎన్నికల్లో యూడీఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

శనివారం ఆయన కేరళ రాష్ట్రంలోని పత్థనంతిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, ర్యాలీల్లో పాల్గొన్నారు., ‘శబరిమల ఆలయంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి, నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది, పొట్ట చేత పట్టుకొని కేరళ యువత ప్రపంచం నలుమూలలకు వలస పోతుండగా ఇక్కడ సీనియర్‌ సిటిజన్స్‌కు సరైన సంక్షేమం, ఆదరణ లేకుండా పోయింది’అని భట్టి స్థానిక పరిస్థితులను ఓటర్లకు వివరించారు. ‘కేరళ అంటే సెక్యులరిజం, ఉన్నత విద్యావంతులు, గొప్ప మానవీయ కోణం ఉంటుందని అంతా భావిస్తాం కానీ ఈరోజు కేరళలో ఆ తరహా పరిస్థితులు కనిపించకుండా పోయాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు.  

మా దగ్గర ఉచిత బస్సు..: తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే ఇందులో 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. విద్యపై కేరళ కంటే తెలంగాణ ఎక్కువ వ్యయం చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement