వీళ్లు మాకొద్దు! | Couple Abandons Children at Police Station Due to Family Disputes: Karimnagar District | Sakshi
Sakshi News home page

వీళ్లు మాకొద్దు!

Apr 28 2026 1:38 AM | Updated on Apr 28 2026 1:38 AM

Couple Abandons Children at Police Station Due to Family Disputes: Karimnagar District

ప్రతీకాత్మక చిత్రం

కుటుంబ కలహాలతో పిల్లలను పోలీస్‌ స్టేషన్‌లో వదిలేసిన దంపతులు

తిమ్మాపూర్‌: దంపతుల మధ్య విభేదాలు పిల్లలను వదిలించుకునే పరిస్థితికి వచ్చాయి. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా ఎల్‌ఎండీ పోలీస్‌ స్టేషన్‌లో జరిగింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ 8వ డివిజన్‌ పరిధిలోని తమిళకాలనీకి చెందిన రవికుమార్‌కు, నిజామాబాద్‌కు చెందిన లలితతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు సంతానం. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. 

లలిత పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. తర్వాత పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా సయోధ్య కుదరలేదు. రవికుమార్‌ ఇటీవల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు లలితను పిలిపించడంతో సోమవారం పిల్లలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఎస్సై అన్వర్‌ దంపతులకు కౌన్సెలింగ్‌ చేశారు. లలిత తనకు భర్త, పిల్లలు అవసరం లేదు అంటూ తాళి, మెట్టెలు తీసి టేబుల్‌పై పెట్టి పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. 

పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. మొండిగా వ్యవహరించింది. రవికుమార్‌ కూడా తనకు భార్య, పిల్లలు అవసరం లేదని వదిలేసి వెళ్లాడు. ఠాణాలోనే ఇద్దరు గొడవ పడటం చూసి పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఠాణాకు వచ్చినవాళ్లు చిన్నారులను చూసి ఆందోళన చెందారు. ఎస్సై అన్వర్‌ చిన్నారుల నానమ్మ వివరాలు తెలుసుకొని ఆమెకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement