రామానుజ విలువలు ఆదర్శనీయం 

CM YS Jagan Mohan Reddy Comments about Sri Ramanujacharya - Sakshi

రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 

ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనందంగా ఉందని వెల్లడి 

సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వైఎస్‌ జగన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గొప్ప విలువలతో కూడిన జీవనం సాగించిన రామానుజాచార్యుల విగ్రహాన్ని స్థాపించి, చినజీయర్‌ స్వామి భావితరాలకు గొప్ప సందేశాన్నిచ్చారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. చినజీయర్‌ నేతృత్వంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనందంగా ఉందన్నారు. ముచ్చింతల్‌లోని రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. సమాజంలో మంచి విలువలు నెలకొల్పేందుకు వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు పరితపించారని పేర్కొన్నారు.

ఆయనకు తన స్వామి ఉపదేశించిన మంత్రాన్ని అందరికీ తెలియజేస్తే పాపం తగులుతుందని అంతా భావించే రోజుల్లోనే, ఆయన ఆ పాపం తనకు తగిలినా ఫర్వాలేదని గొప్ప మనసుతో సమాజానికి మంచి సందేశాలు ఇచ్చారని కొనియాడారు. ఇలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా రామానుజాచార్యులు విలువల కోసం ఎంత గొప్పగా కట్టుబడి ఉన్నారనేది భవిష్యత్‌ తరాలకు తెలియజేసేందుకు చినజీయర్‌ స్వామి కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. సమాజాన్ని మార్చాలన్న గొప్ప సందేశాన్ని ఆయన ఇచ్చారన్నారు. విలువలు మిగిలి ఉన్నాయని చెప్పేందుకు ఇదో మంచి ఉదాహరణ అని జగన్‌ పేర్కొన్నారు.


ముచ్చింతల్‌ క్షేత్రంలో తీర్థప్రసాదాలను స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

ఇంత మంచి కార్యక్రమానికి చేయూతనిచ్చిన మైహోం అధినేత రామేశ్వరరావును జగన్‌ అభినందించారు. అమెరికా నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ చక్కగా శ్లోకాలు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి వచ్చిన  జగన్‌.. చినజీయర్‌ సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధాన కార్యక్రమాన్ని వీక్షించారు.  మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top