సాక్షి,హైదరాబాద్: పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా సామాజిక బాధ్యతలోనూ ముందుంటారని చాదర్‌ఘాట్ పోలీసులు నిరూపించారు. రోడ్డు పక్కన నిరాశ్రయులుగా పడి ఉన్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి, వారికి తగిన ఆశ్రయం కల్పించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
బుధవారం (29.04.2026) ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో మలక్‌పేట్ గంజ్ మార్కెట్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై కొందరు అపరిచిత వ్యక్తులు నివాసం ఉంటున్నట్లు చాదర్‌ఘాట్ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వివరాలు.. వేణుగోపాల్ (46 సం),నరసింహ (60 సం),కృష్ణ (70 సం),భరత్ ఛెత్రి (35సం),అనిల్ (35 సం)లుగా గుర్తించారు.
తీవ్రమైన ఎండలో, సరైన ఆహారం, వసతి మరియు ఆదరణ లేక ఇబ్బంది పడుతున్న వీరిని చూసి చలించిన పోలీసులు, మానవతా దృక్పథంతో తక్షణ సహాయం అందించారు. వారి గౌరవానికి భంగం కలగకుండా, సురక్షితమైన సంరక్షణ కోసం ఐదుగురిని నగరంలోని ఒక షెల్టర్ హోమ్‌కు తరలించారు. అక్కడ వారికి అవసరమైన వసతి మరియు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల ఈ చొరవను స్థానిక ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు అభినందించాయి. ఖాకీల మంచి మనసుపై ప్రశంసలు కురిపించాయి.


