సేవలో ‘అగర్వాల్‌ బంధు’ 

Agarwal Seva Bandhu Supplying Free Oxygen - Sakshi

ఉచితంగా ఆక్సిజన్‌ అందజేత

అన్ని వర్గాల బాధితులకు చేయూత

ఆక్సిజన్‌ అవరమైన వారు  సంప్రదించండి

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ సమస్యలు బాధితులను ఎక్కువగా బాధించాయి. ఇంకా అక్కడక్కడ ఆక్సిజన్‌ అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా ఆక్సిజన్‌ లభించక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉండడంతో వాటిని బాధితులకు అందజేయడానికి కొంత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సేవలు అందజేస్తున్నారు.  

మేమున్నామంటూ... 
గతంలో స్వచ్ఛంద సంస్థలు విరివిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనగా.. ఈసారి కొంత మంది స్నేహితులు ఒక చోట చేరి మేమున్నామంటూ కోవిడ్‌ బాధితులను ఆదుకుంటున్నారు. కరోనా వైరస్‌ సోకి ఇళ్లల్లో హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఆక్సిజన్‌ అందజేయడానికి ముందుకు వచ్చారు. ఆసుపత్రులతో పాటు ఇళ్లల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యవసరంగా ఆక్సిజన్‌ అవసరం ఏర్పడినప్పడు.. వారికి ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్స్‌తో పాటు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లను అందించడానికి పాతబస్తీకి చెందిన పంకజ్‌కుమార్‌ అగర్వాల్‌ తన స్నేహితులను ఒక ఫ్లాట్‌ ఫాంగా మార్చుకుని ఆక్సిజన్‌ సిలిండర్‌లను అందజేసే కార్యక్రమాలను ప్రారంభించారు. నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ సేవలను ‘ప్రాణ వాయు సేవ’గా నామకరణం చేసి ఆక్సిజన్‌ సిలిండర్లను ఉచితంగా అందజేస్తూ.. పలువురి ప్రశంసలు పొందుతున్నారు.  పాతబస్తీ ఘాంసీబజార్‌కు చెందిన హైదరాబాద్‌ కుంభ మేళా అగర్వాల్‌ బంధు అధ్యక్షుడు, అశోక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు పంకజ్‌ కుమార్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలో ఉచిత ఆక్సిజన్‌ సేవలను ప్రారంభించారు. 

‘ప్రాణ వాయు సేవ’మొదలైందిలా... 
పంకజ్‌కుమార్‌ అగర్వాల్‌కు చెందిన ఓ బంధువుల కుటుంబంలో కోవిడ్‌–19 వ్యాధితో బాధపడుతూ నలుగురు మృతి చెందారు. ఈస్ట్‌ చార్మినార్‌ ప్రాంతానికి చెందిన అశోక్‌కుమర్‌ అగర్వాల్, సునీల్‌కుమార్‌ అగర్వాల్‌లతో పాటు మరో ఇద్దరూ అన్నదమ్ములు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కోవిడ్‌తో బాధపడుతూ ఆక్సిజన్‌ అందక మృతి చెందారు.  ఈ సంఘటనలు పంకజ్‌కుమార్‌కు తీవ్ర మనోవేధనకు గురి చేసింది.  కేవలం ఆక్సిజన్‌ అందక మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ  పెరిగిపోతుండడంతో.. అవసరమైన బాధితులకు ఆక్సిజన్‌ సిలిండర్‌లను అందజేయడానికి తన భార్య ప్రియాంక్‌తో కలిసి నిర్ణయం తీసుకున్నారు.    వెంటనే తమ సమాజానికి చెందిన తరుణ్‌ అగర్వాల్, అనూప్‌ అగర్వాల్, బ్రిజ్‌మోహన్, రవీందర్, గోపాల్‌ దాస్‌ తదితరులను సంప్రదించి ఈ నెల మొదటి వారం నుంచి ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్‌లతో పాటు అత్యవసరమైన వారికి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లను అందజేయడానికి కార్యాచరణ రూపొందించుకున్నారు, అనుకున్నదే తడవుగా ఇప్పటి వరకు 100 మంది వరకు బాధితులకు ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్‌లను అందజేశారు.  అలాగే ఎమర్జెన్సీ కింద ఎలాంటి రుసుం వసూలు చేయకుండా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లను అందజేస్తున్నారు.  అంతేకాకండా అవసరమైన బాధితులకు ఆహార పదార్థాలను అందజేస్తున్నారు.  

ఆక్సిజన్‌ సిలిండర్‌ సకాలంలో అందడంతో.. 
కోవిడ్‌–19తో బాధపడుతున్న మా అమ్మ శోభారాణి సోదరుడైన అజయ్‌కుమార్‌ అగర్వాల్‌తో పాటు ఆయన భార్య కవిత అగర్వాల్‌ ప్రాణాపాయం నుంచి బతికి బయట పడ్డారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా.. ఆక్సిజన్‌ అందుబాటులో లేదని పంపించారు. దీంతో పంకజ్‌కుమార్‌ అగర్వాల్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ సరఫరా చేస్తున్నట్లు తెలుసుకుని తెచ్చుకున్నాం. సకాలంలో ఆక్సిజన్‌ లభించడంతో ఇరువురు కోలుకున్నారు.
–  యోగేష్‌ కుమర్‌ అగర్వాల్, వ్యాపారి, చార్మినార్‌  

కోవిడ్‌ బాధితులకు ఉచితంగా.. 
కోవిడ్‌ బాధితుల సౌకర్యార్థం ఆక్సిజన్‌ సిలిండర్‌లను అందిజేస్తున్నాం. అత్యవసరంగా ఆక్సిజన్‌ లభించకపోతే.. 9246550088లో సంప్రదించాలి. రీ–ఫిలింగ్‌తో పాటు కొత్తగా కూడా సిలిండర్‌లను రిఫరెన్స్‌తో అందజేస్తున్నాం. అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లను అందజేస్తున్నాం.  
– రవీందర్‌ నార్నూలీ, అగర్వాల్‌ బంధు ప్రతినిధి 

డిపాజిట్లు.. రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.. 
ఆక్సిజన్‌ సిలిండర్‌తో పాటు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ అవసరమైన వారు మమ్మల్ని సంప్రదిస్తే వెంటనే స్పందిస్తున్నాం. ఎలాంటి డిపాజిట్లు కానీ, డబ్బులు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం తెలిసిన వారి సిఫారసు ఉంటే చాలు. మాకు ఫోన్‌ చేసిన వెంటనే పాతబస్తీలోని ఘాన్సీబజార్‌కు పిలిపించి ఆక్సిజన్‌ సిలిండర్‌లను అందజేస్తున్నాం.  
– పంకజ్‌ కుమార్‌ అగర్వాల్, అగర్వాల్‌ బంధు అధ్యక్షుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top