ఫ 10వేల అడ్మిషన్లు లక్ష్యంగా
బడిబాట
ఫ పిల్లలకు మధ్యాహ్న భోజనంతో
పాటు బ్రేక్‌ఫాస్ట్
ఫ రేపటి నుంచి పాఠశాలలు
పునఃప్రారంభానికి ఏర్పాట్లు
జిల్లా విద్యాశాఖ అధికారి
కె.అశోక్
జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల పునఃప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ అన్నారు. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో డీఈఓ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని 950 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించేలా ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే గోదాం నుంచి ఎమ్మార్సీలకు, అక్కడి నుంచి పాఠశాలలకు పాఠ్య, నోట్ పుస్తకాలు చేరాయి. మొదటి రోజు నుంచే విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన మా లక్ష్యం. అందుకే విద్యార్థి పాఠశాలకు వెళ్లిన రోజే వారికి పుస్తకాలు అందిస్తాం.
విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్..
ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తాం. పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
అడ్మిషన్ల పెంపుపై దృష్టి
గత విద్యా సంవత్సరం బడిబాట ద్వారా 4వేల అడ్మిషన్లు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల మంది విద్యార్థులను కొత్తగా చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 1,900కు పైగా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. ఇంకా ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు.
బడిబాట ద్వారా తల్లిదండ్రులకు అవగాహన..
బడిబాట కార్యక్రమాన్ని విస్త్తృతంగా నిర్వహిస్తున్నాం. ఈ నెల 25 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. బడిబాట ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, నాణ్యమైన విద్యా బోధన, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఉపాధ్యాయుల కొరత లేదు
పాఠశాలల్లో విద్యా బోధనకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఉపాధ్యాయుల కొరత లేదు. కాకపోతే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న దగ్గర తక్కువ ఉపాధ్యాయులు, తక్కువ మంది విద్యార్థులు ఉన్న దగ్గర ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యాక విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం.
డిజిటల్, ఏఐ ద్వారా బోధన
ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులలో విద్యాబోధన అమలు చేస్తున్నాం. ఇంటర్నేట్ ఉన్న పాఠశాలకు ఏఐ, డిజిటల్ లిటరసీ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ బోధన అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యం. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా, పోటీ ప్రపంచంలో రాణించేలా అవసరమైన అన్ని వసతులు, సాంకేతిక సదుపాయాలు, బోధనా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం.


