భానుపురి (సూర్యాపేట) : ఐదు రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఉరుములు వస్తున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండేవారు వీలైతే పక్కా భవనాలలో ఆశ్రయం పొందాలని, వర్షం పడే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
కిడ్స్ ఫొటో కాంటెస్ట్‌లో చిన్నారికి బహుమతి
నడిగూడెం : మండల కేంద్రానికి చెందిన దివ్యశ్రీ, గెల్లా సంగమేశ్ దంపతుల మూడు నెలల కూతురు తుర్వి కృతిక కిడ్స్ ఫొటో కాంటెస్ట్‌లో బహుమతి సాధించింది. ట్రాయో కిడ్స్ కాంటెస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన లిటిల్ మైర్మెడ్ ఫొటో కేటగిరిలో కృతిక ఫొటోలను ఆమె తల్లిదండ్రులు అప్‌లోడ్ చేశారు. సదరు ఫొటోలు కిడ్స్ ఫొటో కాంటెస్ట్ సీజన్–31లో ఎంపికవడంతో సంస్థ వారు చిన్నారికి మెడల్, సర్టిఫికెట్ అందించారు.
లక్ష్మీనరసింహునికి నిత్యపూజలు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారికి అర్చకులు నిత్యపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవారిని పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యురాలి ప్రసవం
పెన్‌పహాడ్ : మండలంలోని అనాజీపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో ఎంఎల్‌హెచ్‌పీ(మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్)గా పని చేస్తున్న డాక్టర్ చిప్పలపెల్లి అనూష శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం కోసం చేరారు. ఆమె నార్మల్ డెలివరీ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వం ఆసుపత్రుల్లోనే ప్రసవం కావడం ఇక్కడ లభిస్తున్న నాణ్యమైన వైద్యానికి నిదర్శనమన్నారు. గర్భిణులు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకొని ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలని కోరారు.


