రెండు రోజులుగా ముమ్మరం
భానుపురి (సూర్యాపేట) : జిల్లా రైతులు సాగు బాట పట్టారు. రోహిణికార్తె నుంచే వివిధ వ్యవసాయ పనులు చేపడుతూ వస్తున్నారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడడంతో పత్తితో పాటు మెట్ట పంటల సాగుకు అనుకూలంగా వ్యవసాయ భూములను సిద్ధం చేస్తున్నారు. మరో ఒకటి, రెండు వర్షాలు పడగానే విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది పంట వ్యర్ధాల తొలగింపు, దుక్కులు దున్నడం వంటి పనులు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా పత్తి సాగు అధికంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైన విత్తనాల కొనుగోలుకు దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. వరి సాగు చేసే రైతులు ఇప్పటికే నారు మళ్లు పోసుకునే పనులను ముమ్మరం చేశారు.
సాగు అంచనా 6.20 లక్షల ఎకరాలు
జిల్లాలో వానాకాలం సీజన్‌లో 6.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో వరి సాగే 4,94,500 ఎకరాల్లో ఉండనుండగా.. రెండోస్థానంలో పత్తి 90,800 ఎకరాల్లో సాగు కానుంది. వరి సాగు కోసం రోహిణి కార్తె నుంచే రైతులు నార్లు పోసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పొలాలను దుక్కి దున్నుకుంటున్నారు.
పదిరోజులు ఆలస్యంగా..
సాధారణంగా మేలోనే అకాల వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సారి మేలో వర్షాలు కురువక పోగా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రుతుపవనాల కంటే ముందుగా కురిసే వర్షాలు సైతం జిల్లాలో 10 రోజులు ఆలస్యమయ్యాయి. గతేడాది మే 25 నాటికే వర్షాలు పడడంతో రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ప్రస్తుతం వర్షాలు ఆలస్యం కావడంతో పంట వ్యర్థాల తొలగింపులోనే ఉన్నారు.
గురు, శుక్రవారాల్లో జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షాలు పడడంతో మెట్ట పంటల సాగు పనులను రైతులు ముమ్మరం చేశారు. వ్యవసాయ పనిముట్ల మరమ్మతులు, విత్తనాల కొనుగోలు, చేలను చదును చేయడం, ట్రాక్టర్ల సాయంతో దుక్కులు దున్నడం చేపడుతున్నారు. జిల్లాకు ఐదురోజుల పాటు వర్ష సూచన ఉండడంతో సాగు పనులు మరింత ముమ్మరం కానున్నాయి.
ఫ తొలకరి వర్షాలతో
వ్యవసాయ పనుల్లో బిజీ
ఫ పంట పొలాల్లోని వ్యర్థాల తొలగింపు, దుక్కి దున్నే పనుల్లో మరికొందరు
ఫ జిల్లాకు ఐదురోజుల
పాటు వర్ష సూచన


