తిరుమలగిరి (తుంగతుర్తి) : కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుమలగిరిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సర్ పేరుతో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను తొలగించి అడ్డదారిలో అధికారంలోకి రావడానికి పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఓట్ల చోరీపై బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఒక పద్ధతి ప్రకారం 30 నుంచి 35 శాతం ఓట్లను ఫేక్‌గా చిత్రీకరించి వాటిని జాబితా నుంచి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ పద్ధతినే ప్రయోగించారన్నారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సర్ పేరుతో హరించవద్దని ఎన్నికల సంఘాన్ని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కత్తి వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, చకిలం నాగేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు వై.నరేష్, సుంకరి జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి ఎంపీ చామల


