సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పాత పాలకవర్గాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. వెంటనే ఆయా పాలకవర్గాలను కొనసాగించే ప్రక్రియను చేపట్టాలని జిల్లా సహకార అధికారులకు (డీసీవో) సహకార శాఖ స్పెషల్ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నల్లగొండ డీసీసీబీ చైర్మన్‌గా కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర డైరెక్టర్లు మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమ, బుధవారాల్లో ఆయా పాలకవర్గాలు బాధ్యతలను స్వీకరించనున్నాయి. డీసీసీబీ పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరితో ముగియడంతో ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ఆ తరువాత మళ్లీ పాలకవర్గం పదవీ కాలాన్ని పొడగించకుండా, గత ఏడాది డిసెంబరు నెలలో వాటిని రద్దు చేసింది. జిల్లా కలెక్టర్లను పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించింది. దీనిపై డీసీసీబీలకు చెందిన కొందరు డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు జీవో 598పై స్టే విధిస్తూ గత నెల 21న ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు.. డీసీసీబీల పాలకవర్గాలను రద్దు చేస్తూ జారీ చేసిన ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టింది. పాత పాలకవర్గాలకు బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లాల సహకార అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు, లేదంటే హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు డీసీసీబీకి పాత పాలకవర్గమే ఉంటుంది.
ఫ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు
పాలకవర్గాల రద్దు జీఓ సస్పెన్షన్
ఫ హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశం


