హుజూర్‌నగర్ : దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు ఈ నెల 15 చివరి తేదీ అని, సమయం తక్కువగా ఉన్నందున రెండో శనివారం, ఆదివారం సెలవు రోజుల్లోనూ దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని హుజూర్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రామారావు తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ, కౌన్సెలింగ్ పూర్తిగా ఉచితమని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యాధునిక వసతులతో కూడిన విద్య అందుతుందని తెలిపారు.
మెగా లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి
హుజూర్‌నగర్ : ఈ నెల 20న జరిగే మెగా లోక్ అదాలత్‌ను కక్షి దారులు వినియోగించుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ శివరాంప్రసాద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీ మార్గమే రాజ మార్గమని, కేసు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారని, రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా శీరిన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జక్కుల వీరయ్య, సీనియర్ న్యాయవాదులు ఎన్. సత్యనారాయణ, కె. బాలకృష్ణ, కె.సైదులు, ఏజీపీ బి.సురేష్‌నాయక్, నగేష్ రాథోడ్, అడవి రాముడు, మౌలాబీ, బి.నరేష్, నాగూర్ బాషా, సైదా హుస్సేన్ పాల్గొన్నారు.


