ఆధునీకరణ ఆలస్యం.. | - | Sakshi
Sakshi News home page

ఆధునీకరణ ఆలస్యం..

Jun 8 2026 10:05 AM | Updated on Jun 8 2026 10:05 AM

అర్వపల్లి: సూర్యాపేట జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తున్న ఎస్సారెస్పీ కాల్వలు ఆధునీకరణకు నోచడం లేదు. సీసీ లైనింగ్‌ లేక కోతకు గురై అధ్వానంగా మారాయి. తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు కోదాడలోని రెండు మండలాలు, సూర్యాపేటలోని మూడు మండలాలకు ఈ కాల్వల ద్వారానే గోదావరి జలాలు అందుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జలయజ్ఞం ద్వారా ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణం చేపట్టారు. 2008లో కాల్వల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటి వరకు లైనింగ్‌ చేపట్టక పోవడంతో కాల్వలు కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయాయి.

తుంగతుర్తి నియోజకవర్గానికి ఇవే ఆధారం

ఎస్సారెస్పీ కాల్వల ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల, నూతనకల్‌ మండలాల పరిధిలోని సుమారు 1.50 లక్షల ఎకరాల గోదావరి జలాలు అందుతున్నాయి. నియోజకవర్గంలో 69,70,71 ప్రధాన డిస్ట్రిబ్యూటరీలు, టెయిలెండ్‌ ఉన్నాయి. వీటితో పాటు 20 వరకు మైనర్‌, సబ్‌మైనర్‌ కాల్వలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 180 కిలోమీటర్ల మేర ఎస్సారెస్పీ కాల్వలు ఉన్నాయి. ఇందులో కేవలం 71 డీబీఎం కాలువ నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాల్లో 7కిలోమీటర్ల మేర లైనింగ్‌ నిర్మించారు.

ముందుకు సాగని నీరు

ఎస్సారెస్పీ కాల్వలకు సీసీ లైనింగ్‌ లేక పోవడంతో ప్రస్తుతం కంపచెట్లు, పొదలు దట్టంగా పెరిగి కాల్వ కనిపించని పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కాల్వ కోతకు గురవుతోంది. ప్రతి సీజన్‌లో అధికారులు కాల్వల ద్వారా గోదావరి జలాలను వదులుతున్నారు. కాల్వ లైనింగ్‌ లేక, చెట్లతో నిండి ఉండడంతో నీరు సాఫీగా పారడం లేదు. కాల్వ చివరి ప్రాంతాలకు సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. ఫలితంగా గోదావరి జలాలు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణకు సుమారు రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ నిధులు మంజూరు కాక పోవడంతో పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల లష్కర్లు, సూపర్‌వైజర్లను నియమించిన ప్రభుత్వం ఆధునీకరణను మాత్రం చేపట్టడం లేదు. ప్రభుత్వం స్పందించి కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం

రైతులకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. తుంగతుర్తి నియోజకవర్గంలో కాల్వల ఆధునీకరణకు రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం.

– ఎం.సత్యనారాయణగౌడ్‌,

నీటిపారుదల శాఖ ఈఈ

సీసీ లైనింగ్‌కు నోచని ఎస్సారెస్పీ కాల్వలు

ఫ కంపచెట్లు, ముళ్ల పొదలతో

నిండిన కాల్వలు

ఫ కాల్వ చివరి భూములకు అందని నీరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement