హుజూర్‌నగర్ : పట్టణంలోని మట్టపల్లి బైపాస్ రోడ్డులోగల గోదా, పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి వారికి చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం సూర్యప్రభ, చంద్రప్రభ, గరుడ, కల్పవృక్ష, అశ్వ, గజ, శేష, హంసవాహానాలపై శ్రీవారు, అమ్మవార్లను, అళ్వార్లను అధిష్టింపజేసి ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. మొదట ఆలయంలో శ్రీవారి మూల మూర్తికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమం, పూర్ణాహుతి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.


