సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో మెంజ్ వైరస్‌తో చర్మవ్యాధుల బారిన పడిన వీధి కుక్కల చికిత్సకు బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ముందుకు వచ్చారు. ఇటీవల వీధి కుక్కల చర్మవ్యాధులు, ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై స్పందించిన బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ షెల్టర్ డైరెక్టర్ ఎన్‌ఎస్‌కే కుమారి, సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమల ఆదేశాల మేరకు శనివారం సూర్యాపేట పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో ఇప్పటి వరకు 194 వైరస్ సోకిన కుక్కలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటి చికిత్స కోసం సుమారు రూ.1.80 లక్షల విలువైన ఇంజక్షన్లు, మందులను అమల సూర్యాపేటకు పంపించారు. జిల్లా బ్లూ క్రాస్ వలంటీర్ నరేందర్ నాయుడు వీటిని జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌కు చెందిన బ్లూ క్రాస్ వలంటీర్లు లాలు, నరేష్ ప్రత్యేక వైద్య బృందంతో కలిసి కుక్కలకు చికిత్స అందించేందుకు సూర్యాపేటకు చేరుకున్నారు. శనివారం నుంచి పట్టణంలోని 48 వార్డులలో వైరస్ సోకిన కుక్కలను గుర్తించి దశలవారీగా చికిత్స అందించనున్నట్లు నరేందర్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, కమిషనర్ సీహెచ్. హన్మంతరెడ్డి, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, వార్డు కౌన్సిలర్లు కోడి శిరీష శివ, స్థానిక కాంగ్రెస్ నాయకులు గుంటి సైదులు, అక్కినపల్లి జానయ్య, యాట వెంకన్న, పొలాగాని కృష్ణ పాల్గొన్నారు.
బ్లూ క్రాస్ పర్యవేక్షణలో 194 కుక్కలకు వైద్య సేవలు


