మునగాల : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని దివ్యాంగులకు కేటాయించాలని, తద్వారా దివ్యాంగులపై ఉన్న చిత్తశుద్ధిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరూపించుకోవాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మండలంలోని తిమ్మారెడ్డిగూడెంలో శనివారం నిర్వహించిన సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. తీవ్ర వైకల్యం ఉన్న వారికి రూ.15 వేలు, ఇతర దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్‌తో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లూరి ఈదయ్యబాబు, రాష్ట్ర నాయకులు కడియం నరేష్, జిల్లా అధ్యక్షుడు పసుల చంద్రయ్య, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్


