భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను సవరించగా.. అది శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ మార్కెట్ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరల్లో చేసిన మార్పులు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వర్తించనున్నాయి. ఈ క్రమంలో భూముల విలువ దాదాపు 15 నుంచి 100 శాతం పెరిగాయి. ప్రధానంగా మార్కెట్ డిమాండ్, అభివృద్ధి, జాతీయ రహదారులకు దగ్గర ఉన్న భూముల విలువలను 50 నుంచి 100 శాతం మేర పెంచింది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా గజం రూ.21,300 ధర పలుకుతోంది. ఇది బహిరంగ మార్కెట్‌లో మరింత ఎక్కువగా ఉండనుంది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వ్యవసాయ భూముల ధరలను కూడా ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు సవరించిన భూముల విలువ ప్రకారమే అదనపు రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
పలుమార్లు వాయిదా పడుతూ..!
భూముల విలువను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా.. వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. గత నెలలోనే మారిన భూముల విలువ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏ ప్రాంతంలో.. ఎంత మేర పెంచాల్సి ఉందన్న వివరాలను సబ్ రిజిస్ట్రార్ల నుంచి సైతం సేకరించింది. ఈ వివరాల నమోదుతో పాటు కొన్నిప్రాంతాల్లో సరైన ప్రతిపాదనలు రాకపోవడంతో వాయిదా వేసి ఈ నెల 2వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులోనూ లోపాల కారణంగా ఈ నెల 5 నుంచి అమలు చేసింది.
వ్యవసాయ భూములు ఇలా..
● జాజిరెడ్డిగూడెం మండలంలో ఎకరాకు గరిష్టంగా రూ.11,81,250, కొమ్మాలలో కనిష్టంగా ఎకరాకు రూ.3,93,750గా ఉంది. గరిడేపల్లిలో ఎకరాకు రూ.5.10 లక్షలు, కుతుబ్‌షాపురంలో రూ.3.93 లక్షలుగా ఉంది.
● తుంగతుర్తి మండలంలో నేషనల్ హైవే వెంట ఉన్న గ్రామాల్లో ఎకరానికి రూ.1,06,000 అత్యధికంగా, రావులపల్లిబండ రామారం, మానా పురం గ్రామాలలో ఎకరాకు రూ.70,000 అత్యల్ప ధరగా నిర్ణయించారు.
● నేరేడుచర్లలో అత్యధికంగా ఒక ఎకరం భూమి విలువ రూ.44,47,500, బోడలదిన్నలో అత్య ల్పంగా రూ.2,25,000గా నిర్ణయించారు.
● మఠంపల్లిలో ఎకరం రూ. 54,55,025, అల్లిపురం, గుండ్లపల్లిలో అత్యల్పంగా రూ. 3,93,750, పెన్‌హాడ్‌లో ఎకరం రూ.11.81లక్షలు, గాజుల మల్కాపురంలో ఎకరం రూ. 5.90 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యవసాయేతర భూముల విలువల రూ.10వేలకు పైనే..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో చాలా ప్రాంతాల్లో రూ.10వేలకు మించే భూముల విలువ సవరణ ఉంది. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్, పీఎస్‌ఆర్ సెంటర్, సీసీ బ్యాంక్ టు పోస్టాఫీస్, ఈద్గారోడ్డు టు సీసీ బ్యాంక్, కొత్త నేషనల్ హైవే టు అలంకార్ రోడ్డు, మున్సిపల్ కార్యాలయ ప్రాంతంలో అత్యధికంగా గజం భూమి రూ.21,300గా ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లు, ఇళ్లకు డిమాండ్ ఉండడంతో భూము ల విలువను ప్రభుత్వం ఈ మేరకు పెంచింది. కనిష్టంగా సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో గజం రూ.5500లుగా నిర్ణయించింది.
కోదాడలో వ్యవసాయేతర భూములకు అత్యధికంగా గజం రూ.26,400 ఉండగా, కనిష్టంగా బాలాజీనగర్‌లో రూ.2300గా ప్రభుత్వం నిర్ణయించింది. అపార్ట్‌మెంట్ల విషయానికి వస్తే కోదాడలోని హుజూర్‌నగర్ క్రాస్‌రోడ్డులో ఒక ఎస్‌ఎఫ్‌టీ గరిష్టంగా రూ.2400, కనిష్టంగా రూ.1800 చొప్పున నిర్ణయించారు.
హుజూర్‌నగర్ పరిధిలో గతంలో అత్యధి కంగా గజం రూ.13,300 ఉండగా పెంచిన ధరలతో రూ.20,300గా నిర్ణయించారు. కనిష్టంగా భూముల విలువ గజం రూ.3వేలుగా ఉంది. హుజూర్‌నగర్‌లో 80 శాతం మేర భూముల విలువ పెరిగింది.
జిల్లాలో కమర్షియల్ భూముల విలువ 50 నుంచి 100శాతం పెంపు
వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువ సైతం సవరణ


