జిల్లా రైతులపై రూ.45 కోట్లకు పైగా భారం
ఇప్పటికే డీజిల్ ధర పెరగడంతో ట్రాక్టర్ల కిరాయిలు పెరిగినాయి. యూరియా ధర పెరగకున్నా డీఏపీకి బదులుగా వాడే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. ఒక్కో బస్తాపై రూ.500ల వరకు పెంచడంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎరువులు పత్తితో పాటు వరిలోనూ చల్లల్సిందే. ప్రభుత్వం పెంచిన ధరలను ఉపసంహరించాలి.
– జటంగి సైదులు, రైతు, కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచింది. జిల్లా రైతాంగం ఈ ఎరువులను అవసరానికి మించి వాడతారు. ఒక్క బస్తా వాడాల్సిన చోట రెండు బస్తాలను వాడుతున్నారు. దాంతో భూమిలో సారం తగ్గుతోంది. రైతులు సంప్రదాయ సాగు వైపు మళ్లాలి. పశువుల ఎరువు, జీలుగ, పచ్చిరొట్టె వంటి వాటిని భూముల్లో చల్లుకోవాలి.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
భానుపురి (సూర్యాపేట) : ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచడంతో రైతులపై భారం పడనుంది. ఇప్పటికే పెట్రో, డీజిల్ ధరలు పెరిగి విత్తనాలు, పురుగు మందుల ధరలు, భూమి దున్నకం ఖర్చులు పెరిగి రైతులు అవస్థలు పడు తున్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు కూడా భారీగా పెరగడంతో సాగు ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. యూరియా, డీఏపీల ధరలు పెరగకపోగా.. కాంప్లెక్స్ ఎరువుల ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఎరువుల ధరల పెంపుతో జిల్లా రైతాంగంపై ఒక్క వానకాలం సీజన్‌లోనే సుమారు రూ.45 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది.
6 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు
సూర్యాపేట జిల్లాలో వానకాలం సీజన్‌లో సుమారు 6 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. ఇందులో అఽత్యధికంగా 4.90 లక్షల ఎకరాల్లో వరి, 90 వేల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. మిగతాది మెట్ట పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలు ఉంటాయి. వ్యవసాయశాఖ అంచనాల మేరకు రైతులు 60వేల మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుంటారు. డీఏపీ ధర ఇప్పటి వరకు కాంప్లెక్స్ ఎరువుల కన్నా అధికంగా ఉండడంతో 14 నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల వరకు వాడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులను 40 నుంచి 45 వేల మెట్రిక్ టన్నుల వరకు వినియోగిస్తున్నారు. ఇందులో చాలామంది రైతులు యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను అధికంగా వినియోగిస్తూ ఆర్థికంగా భారం మోస్తున్నారు.
భారీగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు
యథాతధంగా యూరియా, డీఏపీలు
పెరిగిన ధరలు ఇలా..
డీఏపీ ధరలు అధికంగా ఉండడంతో ఇప్పటి వరకు అదేస్థాయిలో భాస్వరం, ఇతర లవణాలు ఉండే కాంప్లెక్స్ ఎరువులను రైతులు అధికంగా వినియోగిస్తున్నారు. ఇందులోనూ 20–20–00–13 వాడకం అధికంగా ఉంటుంది. 17–17–17, 151–15–15, 28–00–28 వినియోగం తక్కువగా ఉంటుంది. ఇక డీఏపీ వాడకం కూడా మోతాదుగా ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా జిల్లా రైతాంగం అధికంగా వాడే కాంప్లెక్స్ ఎరువులు, అందులోనూ 20–20–00–13 ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో బస్తాపై రూ.500ల వరకు పెరగింది. పాత ధర రూ.1600లు ఉండగా ప్రస్తుతం రూ.2100కు పెరిగింది. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలు సైతం ఒక్కో బస్తాపై రూ.300 నుంచి రూ.500ల వరకు పెరిగాయి. దాంతో జిల్లా రైతాంగంపై ఈ ఒక్క సీజన్‌లోనే రూ.45 కోట్లకు మించి భారం పడనుంది.


