ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నాణ్యమైన విద్య అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) సులోచనారాణి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో శుక్రవారం ఆమె సాక్షి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు ఆమె మాటల్లోనే..
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరగతి గదులు, ఫర్నీచర్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విద్యా బోధన జరిగేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. గత కొన్నేళ్లుగా జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదలతో ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ఈ ఏడాది కూడా గతం కంటే మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం.
ఉచిత పుస్తకాలు, యూనిఫాం, షూస్
ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్‌తో పాటు ఈ ఏడాది ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు, షూస్, బ్యాగ్‌ను ప్రభుత్వం అందిస్తున్నది. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి.
ఈ ఏడాది నుంచి డిజిటల్ విద్య
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ కంటెంట్ ద్వారా బోధన నిర్వహిస్తాం. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సులభంగా పాఠాలను అర్థం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రతి కళాశాలకు నాలుగు ఐఎఫ్‌బీ ప్యానెల్స్ వచ్చాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా వచ్చింది. అధ్యాపకులు డిజిటల్ పద్ధతిలో బోధించనున్నారు. ఈ ఏడాది నుంచే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం
విద్యా ప్రమాణాలు, ఫలితాలు, పోటీ పరీక్షల విజయాల్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది జూలై నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తాం. ప్రతి రోజు స్లిప్ టెస్ట్‌లు, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన ద్వారా వారు ఉత్తీర్ణత సాధించేలా చేస్తాం. ఈ ఏడాది నుంచి 20 ఇంటర్నల్ మార్కులు కలవనుండగా.. దీంతో ఎక్కువశాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుంది.
పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ..
వార్షిక పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్, ఎప్‌సెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తాం. వెబ్ ఆధారిత శిక్షణ కార్యక్రమాలు, ఆన్‌న్‌లైన్ పరీక్షలు, నిపుణుల మార్గదర్శకత్వంతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కూడా జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే మా లక్ష్యం.
ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లపై దృష్టి
పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
D ÝëÇ Ð]l$«§éÅçßæ² ¿Zf¯]l…, AÌêµ-àÆý‡… A…¨…^ól Äñæ*^èl¯]l˘
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
సులోచనారాణి
అడ్మిషన్లు పెంచేందుకు..
గతేడాది నవంబర్, డిసెంబర్‌లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు తమ మండల పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్‌లకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలపై అవగాహన కల్పించారు. పదో తరగతి పరీక్షల అనంతరం కూడా విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి అడ్మిషన్లు పెరిగేలా చూస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 165 అడ్మిషన్లు వచ్చాయి. అడ్మిషన్ల గడువు కూడా ఉండటంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం.


