చిలుకూరు : సీపీఐ జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం చిలుకూరులో విలేకరులతో మాట్లాడారు. సమావేశానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కౌన్సిల్ సభ్యులు సమయానికి హాజరు కావాలని కోరారు.
విశేషంగా లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. నిత్య కల్యాణంలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యా హవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పోస్టులకు దరఖాస్తులు
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని 91 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు బోధించేందుకు ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు అదే గ్రామ పంచాయతీ పరిధిలో నివాసితులై ఉండాలని, 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమేనని, బోధకులకు నెలకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేల చొప్పున 10 నెలల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఆయా ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.
రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి
చివ్వెంల(సూర్యాపేట) : రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త డి.నరేష్ సూచించారు. శుక్రవారం మండలంలోని వాల్యతండాలో నిర్వహించిన రైతు అవగహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సారాన్ని కాపాడ డాటానికి రైతులు సేంద్రియ ఎరువులు వినియోగించాలన్నారు. భూసార పరీక్షలు చేయించి, భూమికి అవసరమైన పోషకాలను, ఎరువులను వినియోగించాలన్నారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ డి.వెంకటేశ్వర్లు, సర్పంచ్ నాగులునాయక్, ఏఈఓ శైలజ, రైతులు పాల్గొన్నారు.


