చివ్వెంల(సూర్యాపేట) : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ముఖ్యమన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించడం కోసం పోలీసు శాఖ అనుక్షణం కృషి చేస్తోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను ఓపెన్ చేయవద్దని సూచించారు. అత్యవసర సమయంలో 100, 112 నంబర్లకు డయల్ చేయాలన్నారు. ఫిర్యాదుదారుల వద్దకే వచ్చి కేసులు నమోదు చేసి ఫిర్యాదుదారులకు కేసు పత్రాలు అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


